గచ్చిబౌలిలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఈనెల 20న 180 ఐసొలేషన్ గదులు ఉండగా, 21న సున్నాగా.. సికింద్రాబాద్‌లోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలో 20న 97 ఐసొలేషన్ పడకలుండగా.. 21న సున్నాగా చూపించాయి. ఇలా దాదాపు 20కి పైగా ఆసుపత్రులు ఐసొలేషన్ పడకల్ని ఎత్తివేశాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతంమంది కొవిడ్ బాధితులు ఇళ్లలో ఉండే చికిత్స పొందుతున్నారు. లక్షణాలు తీవ్రమైన వారు, పరిస్థితి విషమించినవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో కొందరికి ఆక్సిజన్ సేవలు, ఎక్కువమందికి ఐసీయూలో సేవలు అవసరమవుతున్నాయి.
ఒక్కరోజులో 1,421 ఐసీయూ పడకలు
ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆక్సిజన్ సేవల్లో 806 పడకలను, ఐసొలేషన్‌లో 1,186 పడకలను తగ్గించి ఒక్కరోజులోనే 1,421 ఐసీయూ పడకలను పెంచాయి. మొత్తంగా రాష్ట్రంలో ఈనెల 20న అన్ని పడకలు కలుపుకొని 11,055 ఉండగా.. 21 నాటికి 10,484కు తగ్గాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఒక్కరోజులోనే 728 కొవిడ్ పడకలు పెరిగాయి. వీటిలో కొన్ని ఐసొలేషన్‌కు, కొన్ని ఆక్సిజన్ సేవలకు కేటాయించారు. ఆసుపత్రులు కూడా 45 నుంచి 62కు పెరిగాయి. ఐసీయూ పడకలను మాత్రం పెద్దగా పెంచలేదు. ఈనెల 20న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,224 ఐసీయూ పడకలుండగా.. 21 నాటికి 1,241కి పెరిగాయి. పడకల మార్పును బట్టి కొవిడ్ బాధితులు ఎటువంటి సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారో తెలుసుకోవచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
సైనిక పాఠశాలలో 11 మందికి కరోనా