తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏడేళ్లలో రూ.2.32 లక్షల కోట్లు.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ - Minister KTR news

Minister KTR: తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను సోమవారం వెల్లడించారు. దీని ప్రకారం.. టీఎస్‌ఐపాస్‌ ఇప్పటివరకు రూ.2,32,311 కోట్ల పెట్టుబడులతో 19,454 భారీ పరిశ్రమలకు అనుమతులు వచ్చాయని, వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిసింది.

investments are pouring in for telangana
ఏడేళ్లలో రూ.2.32 లక్షల కోట్లు.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

By

Published : Jun 7, 2022, 4:43 AM IST

Investments in Telangana: తెలంగాణలో పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) ద్వారా ఇప్పటివరకు రూ.2,32,311 కోట్ల పెట్టుబడులతో 19,454 భారీ పరిశ్రమలకు అనుమతులిచ్చామని, వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని 2021-22 రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే రూ.17,867 కోట్ల పెట్టుబడులు, 96,863 మందికి ఉపాధి కల్పన కోసం 3,938 పరిశ్రమలు అనుమతి పొందాయని వెల్లడించింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో తెలంగాణ అత్యుత్తమ వాణిజ్య వాతావరణ నగరంగా వంద మార్కులను సాధించిందని, ఎగుమతుల్లో దేశంలో అయిదో ర్యాంకు, గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో వాణిజ్య, పారిశ్రామిక ర్యాంకుల్లో మొదటి స్థానంలో, సృజనాత్మకత, ఆవిష్కరణ, మేధోసంపత్తి హక్కుల్లో అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. ఈ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ సోమవారం విడుదల చేశారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • తెలంగాణ జీఎస్‌డీపీ 2021-22లో 19.1% వృద్ధి రేటుతో రూ.11.54 లక్షల కోట్లు. 2014-15 నుంచి 2021-22 వరకు జీఎస్‌డీపీ 128.3 శాతం వృద్ధి చెందింది. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం.
  • 2021-22లో రాష్ట్రంలో 13 కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధి. 526 పరిశ్రమలకు 810 ఎకరాల భూమి కేటాయింపు. వీటి ద్వారా రూ.6,123 కోట్ల పెట్టుబడులు. 5,626 మందికి ఉపాధి. మొత్తంగా గత ఏడేళ్ల కాలంలో 56 పారిశ్రామికవాడలకు 19,961 ఎకరాలు, పరిశ్రమలకు 2,980 ఎకరాల భూముల కేటాయింపు. మరో 15,520 ఎకరాల అభివృద్ధి. పారిశ్రామిక పార్కుల బయట ఉన్న పరిశ్రమలకు 2,980 ఎకరాల కేటాయింపు.
  • రాష్ట్రంలో 2017-22 వరకు సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు(సీఏజీఆర్‌) 11.4 శాతం కాగా దేశ సీజీఆర్‌ వృద్ధి రేటు 8.5 శాతమే.
  • రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 20.4 శాతం.
  • రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో రూ.1,24,104 కాగా ప్రస్తుతం రూ.2,78,833.

గత ఏడాదిలో వచ్చిన పరిశ్రమలు: జర్మనీ విద్యుత్‌ వాహనాల సంస్థ బాష్‌, భారతీయ రిగ్గుల సంస్థ డ్రిల్‌మెక్‌, గోకుల్‌దాస్‌ ఇమేజెస్‌ అపారెల్‌(జౌళి) సంస్థ, మలబార్‌ గోల్డ్‌, పొకర్న ఇంజినీరింగ్‌, డెన్మార్క్‌ ఇంటిగ్రేటెడ్‌ గ్యాస్‌ టెక్నాలజీస్‌, ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌, సింజెన్‌, ఇవాన్‌హో, యపాన్‌ బయో, పోరస్‌, సీవీఆర్‌, దండు, లారస్‌, జంప్‌, ఎస్‌3వీ వాస్కులర్‌, అమూల్‌, మార్స్‌ పెట్‌కేర్‌, ఫిషిన్‌, కోకకోలా, వీఈఎం, ట్రైటాన్‌, లిటిఆటో, వన్‌మోటో, ఎంఆర్‌ఎఫ్‌, బిలిటి, వెల్‌స్పన్‌, కుందన, కైటెక్స్‌, గ్లోస్టర్‌లు.

  • గత ఏడాది జీవశాస్త్రాల రంగంలో 215 కొత్త పరిశ్రమలు వచ్చాయి. తద్వారా రూ.6,400 కోట్ల పెట్టుబడులు. 34 వేల మందికి ఉపాధి.
  • వైద్యపరికరాల పరిశ్రమల పార్కులో కొత్తగా రూ.1,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 7వేల మందికి ఉపాధి లభించింది.
  • వైమానిక రంగంలో టాటా బోయింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌లు కొత్త ఉత్పత్తులను విడుదల చేశాయి. వీఈఎం విమాన విడిభాగాల సరఫరాను ప్రారంభించింది.
  • 10 వేల ఎకరాల్లో ఆహారశుద్ధి జోన్ల ఏర్పాటుపై కార్యాచరణ.
  • విద్యుత్‌ వాహనాల రంగంలో రూ.5వేల కోట్ల పెట్టుబడులతో 6వేల మందికి ఉపాధి.
  • నేతన్నకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం 20,537 మందికి రూ.96.43 కోట్లను విడుదల చేసింది. చేనేత మిత్రలో 20,135 మందికి రూ. 21.67 కోట్ల పంపిణీ.
  • దండు మల్కాపూర్‌లో వంద ఎకరాల్లో తెలంగాణ బొమ్మల పార్కు ఏర్పాటు.
  • లాజిస్టిక్స్‌ విధానం విడుదల. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి..

చిన్న పరిశ్రమలకు చేయూత: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్కెటింగ్‌, సాంకేతిక సాయం ఇతర సేవల కోసం ఎన్‌ఎస్‌ఈ, జస్ట్‌ డయల్‌, భారత్‌ కాల్‌, సిడ్బి, మేడ్‌ ఇన్‌ తెలంగాణ ఆన్‌లైన్‌ మాల్‌, టీఎస్‌ గ్లోబల్‌ లింకర్లతో అవగాహన ఒప్పందాలు.త
తెలంగాణ తోలు ఉత్పత్తుల పారిశ్రామిక ప్రోత్సాహక సంస్థ ద్వారా మహబూబ్‌నగర్‌, నల్గొండ, మంచిర్యాల, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, ఖమ్మంలలో ఆరు మినీ లెదర్‌ పార్కులు.

ఇదీ చదవండి:ఆదాయం భారీగా వస్తున్నా.. ఆర్థిక స్థితి అస్తవ్యస్తం: భట్టి

ABOUT THE AUTHOR

...view details