దిల్లీలోని హజరత్ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన విదేశీయులపై పోలీసులు ఆరాతీశారు. విదేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నప్పుడే.. ఇరాన్, ఇండోనేషియా, కజికిస్థాన్, మలేషియా, థాయిలాండ్, సూడాన్, అల్జీరియా, బంగ్లాదేశ్ నుంచి బృందాలవారీగా విదేశీయులు ప్రార్థనలకు హాజరైనట్లు నిర్ధరించారు. వారిలో 64 మంది విదేశీయులుండగా వారికి సాయంగా ఏడుగురు వచ్చినట్లు గుర్తించారు. మొత్తం 64 మంది విదేశీయులు, మరో ఏడుగురిపై సుమోటోగా విచారించి కేసులు నమోదుచేశారు.
నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ నిర్వాహకులు జనవరి చివరి వారంలో ప్రార్థనలు ప్రారంభించారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి యువకులు, వృద్ధులు దశలవారీగా వచ్చారు. వారిలో 64 మంది ఫిబ్రవరి 29, మార్చి 1న నాలుగు బృందాలుగా వచ్చారు. అందులో 8 మంది ఇరానీయన్లు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 18 వరకు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రార్థనా మందిరాల్లో బసచేశారు. నల్లగుట్టలో ఆశ్రయం పొందారు.
రెండో బృందంగా వచ్చిన 40 మంది విదేశీయులు ఫిబ్రవరి 21న దేశీయ విమాన సర్వీసుల ద్వారా భాగ్యనగరానికి వచ్చారు. అప్పటి నుంచి మార్చి19 వరకు మలక్‌పేట, టోలీచౌక్, మల్లేపల్లి, పంజాగుట్ట, రియాసత్‌నగర్‌లోని ప్రార్థనా మందిరాలు, స్థానికుల ఇళ్లల్లో ఆశ్రయం పొందారు.