తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇస్తామంటూ రూ.లక్షలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను కాచిగూడ పోలీసులు బుధవారం అరెస్ట్(Gold Fraud Gang Arrested by Hyderabad Police) చేశారు. నలుగురు నిందితులు మహ్మద్ రఫీక్, బింగి శ్రీనివాస్, రెడ్డిపాండురంగారావు, ఎం.అన్వేష్ కుమార్‌ల నుంచి రూ.20 లక్షల నగదు, నకిలీనోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్(Hyderabad CP Anjani Kumar) వెల్లడించారు.
దిల్లీ, ముంబయిలో ఉంటున్న వికాస్‌గౌతమ్, అమిత్‌పటేల్ పరారీలో ఉన్నారని వివరించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఈ ముఠా సభ్యుల పై 50కిపైగా కేసులున్నాయి. కర్ణాటకకు చెందిన మహ్మద్ రఫీక్, జగిత్యాల జిల్లా వాసి బింగి శ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన రెడ్డివారి పాండురంగారావు, మంచిర్యాలో ఉంటున్న అన్వేష్‌కుమార్‌లు పదేళ్ల క్రితం వేర్వేరు సందర్భాల్లో పరిచయమయ్యారు. మొదట బంగారం ప్రకటనలు చూసి వీరు మోసపోయారు. దీంతో మనమే మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు.
కిలో బంగారంపై రూ. 5 లక్షలు తగ్గింపు
దుబాయ్(Dubai Gold) నుంచి నాణ్యమైన బంగారం తెప్పిస్తున్నామని తక్కువ ధరకే బిస్కెట్లు ఇస్తామంటూ మహ్మద్ రఫీక్ బృందం ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది. దిల్లీకి చెందిన వికాస్‌గౌతమ్, ముంబయి వాసి అమిత్‌పటేల్ నమ్మి డబ్బుతో హైదరాబాద్‌కు వచ్చారు.
వీరి వద్ద బంగారం లేదని, మోసం చేస్తున్నారని గ్రహించారు. వారిని ప్రశ్నించగా మీరూ మాతో కలవండి అంటూ చెప్పారు. వికాస్ గౌతమ్, అమిత్‌పటేల్ ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇస్తూ ఆకర్షించేవారు. వారితో మాట్లాడి కిలో బంగారం బిస్కెట్లు కొంటే మార్కెట్ ధర కంటే రూ.5లక్షలు తక్కువకే ఇస్తామంటూ చెప్పేవారు.
నైలాన్ సంచి.. నకిలీ కరెన్సీ..
బంగారు బిస్కెట్లు(Dubai Gold) కొనేవారి వద్దకు మహ్మద్ రఫీక్, శ్రీనివాస్, పాండురంగారావు, అన్వేష్ వెళ్తారు. నైలాన్ సంచి, నకిలీ కరెన్సీ కట్టలు, సూట్‌కేస్ తీసుకెళ్తారు. సూట్‌కేస్‌ను రెండు అరలుండేలా తయారు చేయించారు. బాధితుడి వద్దకు వెళ్లగానే నగదు చూపించాలని, దానిని తాము తెచ్చిన నైలాన్ సంచిలో భద్రపరిచి తాళం వేయాలని, ఒక తాళం బాధితుడు, మరో తాళం మా వద్ద ఉంటుందని చెబుతారు.
నగదు తీసుకున్నాక నైలాన్ సంచిలో నోట్ల కట్టలు పెట్టి దానికి తాళం వేస్తారు. తర్వాత సంచిని సూట్‌కేస్‌లోని పై అరలో పెట్టేస్తారు. సూట్‌కేస్‌ను బాధితుడికి అప్పగించాక బంగారం తెస్తామంటూ నటిస్తారు. ఒక నిందితుడు రూం తాళం పడిపోయింది.. బంగారం బిస్కెట్లు తెచ్చేందుకు ఆలస్యమవుతుందని బాధితుడి దృష్టి మళ్లించి సూట్‌కేస్‌ను కిందికీపైకి మార్చేస్తాడు.
బాధితుడు ఇచ్చిన నగదున్న సంచిని తీసుకుని నకిలీ కరెన్సీతో ఉన్న నైలాన్ సంచిని ఇచ్చేస్తాడు. గంటలో వస్తామంటూ వెళ్లిపోతారు. నెల క్రితం కాచిగూడలో ఉంటున్న అబ్దుల్ అఫ్రోజ్ వీరితో ఫోన్‌లో కిలో బంగారం రూ.40 లక్షలకు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈక్రమంలోనే అబ్దుల్ ఇంటికి వెళ్లి సూట్‌కేస్ మార్పిడి చేసి రూ.40 లక్షలు కొట్టేశారు.