తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు ఎలా.. ఆందోళనలో విద్యార్థులు - Inter Admissions in AP

Intermediate Admissions in AP : పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో పిల్లల్ని ఇంటర్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు కళాశాలలకు వెళ్లి సీట్ల కోసం అడుగుతున్నారు. ప్రవేశాలపై ఏపీ ఇంటర్‌ విద్యామండలి ఎలాంటి ప్రకటనా చేయనందున సీట్ల భర్తీపై కళాశాలలు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది

Intermediate Admissions in AP
Intermediate Admissions in AP

By

Published : Jun 9, 2022, 8:33 AM IST

Intermediate Admissions in AP : ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది ప్రవేశాలను ఆన్‌లైన్‌లో ఆ రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందా లేక కళాశాలలే అడ్మిషన్లు నిర్వహించుకోవాలా అనేదానిపై స్పష్టత కొరవడింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో పిల్లల్ని ఇంటర్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు కళాశాలలకు వెళ్లి సీట్ల కోసం అడుగుతున్నారు. ప్రవేశాలపై ఇంటర్‌ విద్యామండలి ఎలాంటి ప్రకటనా చేయనందున సీట్ల భర్తీపై కళాశాలలు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

జులై 1 నుంచి రెండో ఏడాది తరగతులు ప్రారంభించనున్నారు. ఇంటర్‌ మొదటి ఏడాది తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై అయోమయం నెలకొంది. వరసగా గత రెండేళ్లూ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించారు. దీనిపై ప్రైవేటు యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆన్‌లైన్‌ విధానాన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో రెండేళ్లూ కళాశాలలే ప్రవేశాలు నిర్వహించుకున్నాయి. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే నిర్వహించేందుకు మరోసారి ఇంటర్‌ విద్యామండలి కసరత్తు చేసింది. ఇందు కోసం నల్సార్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌, మరో ఇద్దరు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై న్యాయ సలహా తీసుకునేందుకు ప్రభుత్వానికి దస్త్రం పంపింది.

రీజియన్ల వారీగా ఇబ్బందులుఆన్‌లైన్‌లో ప్రభుత్వం ప్రవేశాలు నిర్వహిస్తే స్థానికేతరులకు 15శాతం సీట్లను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఒక రీజియన్‌గా.. రాయలసీమ జిల్లాలు, నెల్లూరును మరో రీజియన్‌గా పరిగణిస్తారు. రాయలసీమకు చెందిన వారు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాలకు స్థానికేతరులవుతారు. వీరికి ఇక్కడ మొత్తం సీట్లలో 15శాతమే ఉంటాయి. ఇంటర్మీడియట్‌లో ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌ కోసం ఎక్కువ మంది పిల్లలు గుంటూరు, విజయవాడల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. రాయలసీమ వారు సైతం ఈ ప్రాంతాలకే వస్తారు. ఈ విధానం కారణంగా వారికి సీట్ల లభ్యత కష్టమవుతుంది. అంతేకాకుండా కళాశాలల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. మొదటి, రెండు విడతల కౌన్సెలింగ్‌లో ఆ సీట్లు భర్తీ కాకపోతే ఆ తర్వాత ఇంటర్‌ విద్యామండలి ప్రత్యేక అనుమతితోనే భర్తీ చేసుకోవాలి.

  • మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పిల్లలు తమ సమీపంలోని కళాశాలలో చేరాలంటే కుదరదు. ఆన్‌లైన్‌లో కనీసం రెండు, మూడు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.
  • అమ్మాయిలను ఎక్కువగా ఇంటికి సమీపంలోని కళాశాలల్లో చదివించాలని తల్లిదండ్రులు భావిస్తారు. ఆన్‌లైన్‌తో కళాశాలను నేరుగా ఎంచుకునే అవకాశం ఉండదు. ఐచ్ఛికాలు మాత్రమే నమోదు చేయాలి.
  • పదో తరగతి విద్యార్థికి ఆన్‌లైన్‌లో కళాశాలను ఎంపిక చేసుకునే పరిజ్ఞానం సరిగా ఉండదు. ఒకవేళ తల్లిదండ్రులు చదువుకోని వారై ఉంటే.. ఐచ్ఛికాల నమోదుకు ఇంటర్నెట్‌ కేంద్రాలపై ఆధారపడాలి.
  • ఇంటర్‌ తర్వాత జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ లాంటి పరీక్షలకు తర్ఫీదు ఇచ్చే వాటిలో సీట్లు రాకపోతే విద్యార్థులు ఏం చేయాలి? ఇలా అనేక అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంది.
  • ఇంటర్‌ ప్రవేశాలు జులై 4లోపు పూర్తి చేయాలి. ఒకవేళ జాప్యం చేస్తే విద్యా సంవత్సరాన్ని పొడిగించాల్సి వస్తుంది. ఇది కేంద్రం నిర్వహించే జేఈఈ మెయిన్‌, నీట్‌ సన్నద్ధతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇంటర్‌ ప్రవేశాలపై ప్రభుత్వం వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • ఇదీ చదవండి :గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎప్పుడంటే?
  • బావిని శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి.. ముగ్గురు అన్నదమ్ములే!

ABOUT THE AUTHOR

...view details