తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇళ్లలో ఆక్సిజన్ నిల్వలు.. మరి ప్రైవేటు ఆసుపత్రుల్లో..?

ఏపీలో కరోనా కేసుల తాకిడి వల్ల ప్రాణవాయువు అవసరాలు పెరుగుతున్నాయి. కొవిడ్‌ సోకి ఆయాసం, దగ్గు, జ్వరం ఇతర లక్షణాలు తీవ్రంగా ఉన్న కొందరిలో ప్రాణవాయువు స్థాయి పడిపోతోంది. వారికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌.. కొవిడ్‌ కేసుల పెరుగుదలకు తగినట్లుగా సరిపోవడం లేదు. కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ చికిత్సలకు కావాల్సిన ప్రాణవాయువు కోసం యాజమాన్యాలు హైరానా పడుతున్నాయి. మరోపక్క ముందు జాగ్రత్త చర్యగా ఇళ్లలో ఆక్సిజన్‌ను నిల్వ ఉంచుకునే వారి సంఖ్యా పెరుగుతోంది.

ap news, oxygen news, corona news
ap news, oxygen news, corona news

By

Published : Apr 24, 2021, 9:12 AM IST

ఏపీ రాష్ట్రంలో 75 నుంచి 100 మంది డీలర్లు పరిశ్రమలకు, ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. ఉత్పత్తి సంస్థల నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుండటం, రాష్ట్రంలో అవసరాలు పెరగడం వల్ల ఇంతకుముందులా ఆక్సిజన్‌ తగిన మోతాదులో అందడంలేదని విజయవాడకు చెందిన ప్రధాన డీలర్‌ ఒకరు తెలిపారు. వీరి నుంచి సాధారణ రోజుల్లో ఆరు నుంచి ఏడు టన్నుల ఆక్సిజన్‌ విజయవాడలోని ఆసుపత్రులకు సరఫరా అవుతోంది. ఇప్పుడు 20 టన్నుల దాకా ఆర్డర్లు వస్తున్నాయని డీలరు చెప్పారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు ద్రవరూపంలోని ఆక్సిజన్‌ను ట్యాంకుల్లో నిల్వచేసి, దానిని వాయురూపంలోకి మార్చి గొట్టాల ద్వారా వార్డుల్లోని రోగులకు సరఫరా చేస్తున్నారు. రీఫిల్‌ చేసుకొనే సౌకర్యం ఉన్న సిలిండర్ల ద్వారానూ ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. సిలిండర్ల తయారీ కష్టం కావడం వల్ల అనేక సంస్థలు తక్కువ వ్యవధిలో అన్ని ఆసుపత్రులకూ సరిపడా ఆక్సిజన్‌ సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో ట్యాంకుల్లో నిల్వచేసి, అవసరాలకు తగ్గట్లు వాడుకుంటున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో సిలిండర్ల సాయంతో నాజల్‌ కాన్యులా లేదా ఆక్సిజన్‌ మాస్కుల ద్వారా రోగులకు ప్రాణవాయువు అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆక్సిజన్‌ను ఇంట్లో అందుబాటులో ఉంచుకునే వారూ క్రమంగా పెరుగుతున్నారు. ఇందుకోసం విపరీతంగా ఫోన్లు వస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు.

సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్ల కోసం..

ప్రస్తుతం సిలిండర్లకు డిమాండ్‌ పెరిగింది. 65 కేజీల బరువు సిలిండరులో 7.5 క్యూబిక్‌ మీటర్ల ఆక్సిజన్‌ ఉంటుంది. డిపాజిట్‌ కింద రూ.10 వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులోని ప్రాణవాయువును వినియోగించాక రీఫిల్‌కు రూ.500, రూ.700 వరకు తీసుకుంటున్నారు. డీలర్లను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. దీనితోపాటు బయట నుంచి గాలి, తేమ తీసుకొని ఆక్సిజన్‌ తయారు చేసే కాన్సన్‌ట్రేటర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. సాధారణంగా వీటిని ఆస్తమా రోగులు వాడుతుంటారు. రకరకాల పరిమాణాల్లో అందుబాటులో ఉన్న వీటిని ప్రస్తుతం పలువురు కొనుగోలుచేసి, ఇళ్లల్లో ఉంచుకుంటున్నారు. ఇవి విద్యుత్తుతో పనిచేస్తాయి కాబట్టి ఆక్సిజన్‌ అయిపోతుందన్న బెంగ అక్కర్లేదు. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సిలిండర్లలో ఆక్సిజన్‌ ఫ్యూరిటీ 90% వరకు ఉంటే.. అది కాన్సన్‌ట్రేటర్‌లో 80% నుంచి 85% అని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న ఆసుపత్రులు వీటిని అద్దెకు తీసుకుని వినియోగిస్తున్నాయి. కొవిడ్‌ హడావుడి లేనప్పుడు నెలకు 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు అద్దె తీసుకుని ఇళ్లకు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.

ధరల పెంపు..

ప్రముఖ కంపెనీలు కాన్సన్‌ట్రేటర్లను తయారు చేస్తున్నాయి. రూ.45 వేల నుంచి రూ.60 వేల మధ్యన ఉన్న వీటి ధరలు ప్రస్తుతం 50% పెరిగినట్లు చెబుతున్నారు. ఆర్డరు ఇస్తే రావడానికి రెండు, మూడు రోజుల దాకా పడుతోంది.

వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి

అత్యవసర సమయాల్లో అదీ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలోనే ఇళ్లలోనూ ఆక్సిజన్‌ను వినియోగించాలి. రోగి ఆరోగ్య పరిస్థితి, శరీరంలో ఆక్సిజన్‌ శాతం ఎంత ఉంది, ముందు నుంచే జబ్బులున్నాయా... వంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ప్రాణవాయువును ఎంతమేర ఇవ్వాలన్న దానిపై నిర్ణయాలు ఉంటాయి. - పీవీఎస్‌ విజయభాస్కర్‌, జనరల్‌ ఫిజీషియన్‌, ఛైర్మన్‌, రూట్స్‌ ఫౌండేషన్‌

ఇదీ చదవండి:భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్​వీ రమణ

ABOUT THE AUTHOR

...view details