తెలంగాణ

telangana

ETV Bharat / city

డ్రైవర్ల నిర్లక్ష్యం.. క్షతగాత్రులకు ప్రాణసంకటం! - Hyderabad road accidents

రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్ పరిధిలో ఏటా వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. వాహనాలు ఢీకొని తీవ్రంగా గాయపడిన వారిని తక్షణం ఆస్పత్రికి తరలిస్తే చాలామంది బతికే అవకాశం ఉంటుంది. కానీ ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లు మానవత్వాన్ని మరిచి రక్తమోడుతున్న క్షతగాత్రులను కనీసం పట్టించుకోకుండా పరారవుతున్నారు. అధిక రక్తస్రావంతో ఘటనా స్థలిలోనే కొందరు దుర్మరణం చెందుతున్నారు.

injured-in-road-accidents-dying-as-the-drivers-left-them-on-the-spot
డ్రైవర్ల నిర్లక్ష్యం.. క్షతగాత్రలకు ప్రాణసంకటం!

By

Published : Mar 12, 2021, 9:15 AM IST

Updated : Mar 12, 2021, 12:04 PM IST

హైదరాబాద్ పరిధిలో జరిగే రహదారి ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019తో పోలిస్తే 2020లో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 20 శాతం పెరిగిందని, ఇందుకు గల ప్రధాన కారణాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యమూ ఒకటని వైద్యుల సమాచారం మేరకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలా వదిలేసి వెళ్లే డ్రైవర్లపై కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. తక్షణం వాహన లైసెన్సు రద్దు చేస్తామంటున్నారు. ఈ కేసు వల్ల అదనంగా మూడు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన 77 శాతం మందికి సకాలంలో వైద్యం అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయి సమాచారాన్ని రాబట్టారు. ఇందుకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్లేనని తేల్చారు. ఇకపై ఇలాంటి లోపాలకు తావివ్వకుండా, కఠినంగా వ్యవహరించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. క్షతగాత్రులను తక్షణం ఆస్పత్రులకు తరలించే విషయంలో పెద్దఎత్తున వాహనదారుల్లో చైతన్యం నింపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మోటారు వాహనాల(ఎంవీ) చట్టం గురించి తెలియజేయనున్నారు. చట్టం ప్రకారం, రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ గాయపడిన వారిని తమ వాహనంలో గానీ వేరే వాహనంలో గానీ వైద్యశాలకు తరలించడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలా చేయని పక్షంలో ఎంవీ చట్టం 1988 సెక్షన్‌ 134 కింద కేసు నమోదు చేస్తామని, బాధ్యుడికి జైలుశిక్షతోపాటు పాటు అదనంగా మూడు నెలల జైలుశిక్ష, జరిమానా పడేలా చూస్తామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. సంబంధిత డ్రైవర్‌ లైసెన్సును వెంటనే రద్దు చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పారు.

కూకట్‌పల్లికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ ఇటీవల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని అతి వేగంగా ఆటో నడిపాడు. అదుపుతప్పిన వాహనం విభాగినిని ఢీకొని తల్లకిందులైంది. అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్‌కు ఏమీ కాలేదు. అతను క్షతగాత్రులను మరో వాహనంలో ఆస్పత్రికి తరలించి ఉంటే వారికి వెంటనే వైద్యం అందేది. కానీ పోలీసుల భయంతో అతను పరారయ్యాడు. గాయపడిన అయిదుగురు గంట పాటు బాధతో అల్లాడిపోయారు. తట్టుకోలేక ఒకరు ప్రాణాలు విడిచారు.

ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ వాహనదారుడు అతి వేగంగా నడుపుతూ తమ ముందున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ బండి డ్రైవరుసహా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ స్పందించకుండా వెళ్లిపోయాడు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందలేదు.

Last Updated : Mar 12, 2021, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details