శ్రావణమాసం... కలియుగ దైవం వేంకటేశ్వరుడు జన్మించిన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ నెల సంవత్సరంలో అయిదోది. మహావిష్ణువు- మహాలక్ష్మికి ఇష్టమైన ఈ మాసం పెళ్లిళ్లు, నోములు, వ్రతాలు, పూజలు ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు అనువైనదని చెబుతారు. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలే కాదు, అమావాస్య, అష్టమి రోజులను కూడా పర్వదినాలుగా పరిగణించడం విశేషం. పురాణాల ప్రకారం... పాల సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు ఈ శ్రావణమాసంలోనే స్వీకరించి నీలకంఠుడిగా పేరు పొందాడని ప్రతీతి. అందుకే ఈ నెలలో వచ్చే సోమవారాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా మంచి భర్త లభించాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఈ నెలలో వచ్చే పంచమిని నాగపంచమిగా పిలుస్తారు. సంతానం లేనివారు ఈ రోజున ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి నాగ దేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని, సర్వదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. పుత్రద ఏకాదశిగా పిలిచే శ్రావణ శుక్ల ఏకాదశి రోజున కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో వచ్చే శ్రావణ శుక్ల విదియ నాడు రాఘవేంద్రస్వామి జీవసమాధి అయ్యాడు కాబట్టి... ఆ రోజున మంత్రాలయంలో విశేష పూజలు జరుపుతారు.
వరలక్ష్మీ రావమ్మా
ఈ నెలలో వచ్చే శుక్రవారాలను శ్రావణ శుక్రవారాలుగా పిలుస్తారు. ఈ రోజుల్లో మహిళలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. చారుమతీ దేవి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలూ, సకల శుభాలూ పొందిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కథను అనుసరించే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పేరుతో నవ వధువులు, వివాహితులు వరలక్ష్మీ దేవిని పూజించి ఇరుగుపొరుగు స్త్రీలను ఆహ్వానించి పేరంటం నిర్వహిస్తారు.
రాఖీ పౌర్ణమికి ఎంతో విశిష్ఠత