మంత్రి కేటీఆర్ చాలా అహంభావంతో మాట్లాడారని... కాంగ్రెస్‌పై విమర్శలు చేసేటప్పుడు తన తండ్రి చరిత్ర కూడా తెలుకుని మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సింగిల్ విండో డైరెక్టర్‌గా ఓడిపోయినా... ఛైర్మన్‌గా కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. కేసీఆర్ మొదట సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గాంధీ కుటుంబంతో కేసీఆర్ కుటుంబం పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడింది గాంధీ కుటుంబమని... దేశ అభ్యున్నతి కోసం ఇందిర, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని కొనియాడారు. అవకాశమున్నా కూడా ప్రధాని పదవిని సోనియా, రాహుల్ చేపట్టలేదని చెప్పారు. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరుల ఆధారంగానే తాము వరంగల్ డిక్లరేషన్ ప్రకటించినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల భరోసా కోసమే వరంగల్ సభా వేదిక నుంచి కాంగ్రెస్ వ్యవసాయ విధానం ప్రకటించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొమ్మిది ప్రధానమైన తీర్మాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
'రాహుల్‌గాంధీ ఏ హోదాలో రాష్ట్రానికి వచ్చారని అంటున్నారు. ఎక్కడెక్కడో చదువుకున్న కేటీఆర్‌కు.. తెలంగాణలో ఏం అర్హత ఉంది. వరంగల్ డిక్లరేషన్‌కు మద్దతుగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. శరద్‌పవార్, స్టాలిన్, దీదీ వద్దకు కేసీఆర్ వెళ్లిరావచ్చు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన రాహుల్‌ను ప్రశ్నిస్తారా? రాహుల్ పొలిటికల్ టూరిస్ట్ అయితే.. మరి కేసీఆర్‌ను ఏమనాలి? భాజపా, తెరాస, మజ్లిస్ ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయి. ' - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు