Diwali Celebrations in Hyderabad: దీపావళి సంబురాలతో మురిసిన భాగ్యనగరం హైదరాబాద్ మహానగరం దీపావళి వేడుకలతో మురిసిపోయింది. గల్లీ గల్లీ పండుగ సంబురాలతో సందడిగా మారింది. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా జరుపుకునే దీపావళిని భాగ్యనగర వాసులు ఘనంగా చేసుకున్నారు.
దీపాల వెలుగుల్లో లోగిళ్లు..
దీపాల వెలుగుల్లో లోగిళ్లు కాంతులీనగా.. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు విద్యుద్దీపపు వెలుగులో మెరిసిపోయాయి. గతేడాది కరోనాతో దీపావళిని నామమాత్రంగా జరుపుకున్న భాగ్యనగరవాసులు.. ఈసారి ఘనంగా చేసుకున్నారు. కరోనా చీకట్లు పూర్తిగా తొలగిపోవాలని దేవుణ్ని ప్రార్థిస్తూ వేడుకల్లో మునిగిపోయారు.
భాగ్యనగరంలోని రాణిగంజ్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరి, దిల్‌సుఖ్‌నగర్, లింగంపల్లి, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లోని వాణిజ్య, వ్యాపార సంస్థలు విద్యుత్ కాంతులతో ధగధగ మెరిశాయి. ఇంటిల్లిపాది ధనలక్ష్మి పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
ఆనంద డోలికల్లో..
చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కుటుంబసభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు కలిసి బాణసంచా కాల్చారు. టపాసులు పేల్చి ఆనంద డోలికల్లో మునిగిపోయారు. పెద్దల సమక్షంలో పిల్లలు కేరింతలు కొడుతూ దీపావళిని జరుపుకున్నారు.
ఇదీచూడండి:ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు.. తైవాన్లో సమోసాలతో..