HYD Police saves life: ఆపదుందని కాల్ చేస్తే.. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వాలిపోయే హైదరాబాద్ పోలీసులు మరోసారి వృత్తిధర్మాన్ని నిర్వర్తించారు. కొనఊపిరి మీదున్న ఓ వ్యక్తిని కాపాడి.. శెభాష్ అనిపించుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని కాపాడేందుకు సమయానికి వచ్చి.. నిండు ప్రాణాన్ని కాపాడారు. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేతిబౌలి వద్ద ఓ అపార్ట్మెంట్లో శివరాజ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన శివరాజ్ భార్య రాధ.. తన భర్తను రక్షించుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. అయినా.. కాపాడే మార్గం కన్పించలేదు. చుట్టుపక్కలున్న స్థానికులను సాయం కోరింది. కానీ.. వాళ్లెవరూ ధైర్యం చేయలేకపోయారు. తమ మీదికి ఎక్కడొస్తుందోనని భయపడి.. ప్రేక్షకపాత్ర పోషించారు.
క్షణాల్లోనే అన్నీ..
Police saved hanging man: ఇక్కడ అప్పుడే రాధకు పోలీసులు గుర్తొచ్చారు. వెంటనే డయల్-100కు కాల్ చేసింది. వెంటనే స్పందించిన పెట్రోలింగ్ సిబ్బంది సందీప్(ప్రొబిషన్ ఎస్సై), కానిస్టేబుళ్లు హరీశ్, సంతోష్ కుమార్, సురేష్.. క్షణాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే శివరాజ్ ఉరేసుకున్నాడు. ఎలాంటి ఆలస్యం చేయకుండా.. తలుపులు పగలగొట్టారు. ఉరేసుకున్న శివరాజ్‌ను వెంటనే కిందికి దించారు. అప్పటికే స్పృహ కోల్పోయిన శివరాజ్‌కు సీపీఆర్ అందించారు. స్పృహలోకి రావడంతో... హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇవన్నీ చూస్తున్నంతసేపట్లో చకచకా జరిగిపోయాయి.