మరో రెండు రోజుల్లో బక్రీద్ (bakrid) పండగ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొట్టేళ్లను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కొనుగోలు అమ్మకందారులతో పొట్టేళ్ల మండీలు కళకళలాడుతున్నాయి. ప్రతీ బక్రీద్‌కు పొట్టేళ్లను కొనుగోలుచేయడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం సోదరులు పేర్కొంటున్నారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
మాంసాన్ని మూడు భాగాలుగా చేసి..
రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ఖుత్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుర్బానీ పేరిట జంతువులను బలిస్తారు. కుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. కుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే కారణమని ముస్లీంలు భావిస్తారు. ప్రవక్త కాలంలో ఒక వ్యక్తి తన కుటుంబం తరఫున ఒక గొర్రె, మేకను కుర్బానీ ఇచ్చేవారు. గొర్రె, మేక కుర్బానీ ఇచ్చే స్థోమత లేని కుటుంబాలు... ఏడుగురు కలిసి ఒక ఆవును, పది మంది కలిసి ఒక ఒంటెను ఇవ్వవచ్చు. కొమ్ములు గల జంతువు, కాళ్లు, ఉదరం నల్లగా ఉన్న పొట్టేలు, కళ్లు నల్లగా, బలిష్టమైన, ఖరీదైన జంతువులను కుర్బానీ ఇవ్వడం అభిలషణీయం. బక్రీద్ రోజున మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తుంటారు.
పెరిగిన ధరలు..
ఇక గత ఏడాదితో పోలిస్తే.. మేకలు, పొట్టేళ్ల ధరలు కాస్త పెరిగినట్లు కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కరోనా కారణంగా పొట్టేళ్ల అమ్మకాలు పెద్దగా జరగలేదని అమ్మకందారులు తెలిపారు. ఈ ఏడాది సైతం కరోనా ఉన్నప్పటికీ.. గత ఏడాదికంటే కాస్త ఫర్వాలేదంటున్నారు. సాధారణ పొట్టేళ్లు జత రూ.18,000ల వరకు ఉన్నాయని.. కాస్త పెద్దవి అయితే రూ.20,000ల వరకు పలుకుతున్నాయి. ఇంకాస్త పెద్దవి అయితే.. రూ.25,000ల వరకు పలుకుతున్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే..రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధరలు పెరిగాయంటున్నారు.
కళకళళాడుతున్న మండీలు..
నగరంలోని చాలా ప్రాంతాల్లో పొట్టేళ్లు, మేకల మండీలు కళకళలాడుతున్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం రోడ్, మొహదీపట్నం, జియాగూడ మేకల మండీ, టోలీచౌక్, ఆసీఫ్ నగర్, బహదూర్ పురా, రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో జీవాలను విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పొట్టేళ్లు ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రత్యేకంగా పెంచిన పొట్టేళ్లు కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటికి ప్రత్యేకమైన దాణా పెడుతూ.. కేవలం బక్రీద్ కోసం మాత్రమే వాటిని పెంచుతున్నామని అమ్మకందారులు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి:lovers suicide: ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య