తెలంగాణ

telangana

ETV Bharat / city

బద్ధకాన్ని వీడి, భయాన్ని జయించి.. ఓటు వేశారు.. బాధ్యత చాటారు! - ghmc election polling percentage

బల్దియా ఎన్నికల్లో ప్రధాన నగరానికి భిన్నంగా శివారు ఓటర్లు స్ఫూర్తి చాటారు. కొవిడ్‌ భయాన్ని లెక్కచేయలేదు. వరుస సెలవులని ఊరుకోలేదు. నగరాభివృద్ధిలో భాగమయ్యేందు తమ బాధ్యతను చాటుకున్నారు.

Hyderabad outskirts voters casted their vote
ఓటు వేశారు.. బాధ్యత చాటారు

By

Published : Dec 3, 2020, 9:00 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో నగర శివారు ఓటర్లు స్ఫూర్తి చాటారు. నగర ప్రజలతో పోలిస్తే.. బద్ధకం వీడి, భయాన్ని జయించి ఓటు వేశారు. పటాన్‌చెరు నియోజకవర్గమే తీసుకుంటే ఇక్కడి మూడు డివిజన్లలో అత్యధిక పోలింగ్‌ నమోదైంది. అలానే హయత్‌నగర్‌, గాజులరామారం, కుత్బుల్లాపూర్‌, కాప్రా, ఉప్పల్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌, మూసాపేట, అల్వాల్‌ సర్కిళ్ల పరిధిలో 45 శాతానికి పైగా ప్రజలు ఓటేశారు.

నగరంలో ఆ పరిస్థితి లేదు. మలక్‌పేట, ఖైరతాబాద్‌, నాంపల్లి, మాదాపూర్‌, చందానగర్‌ ప్రాంతాల్లో 40 శాతం లోపే పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా ఎన్నిక జరిగిన 149 డివిజన్లలో 46.55శాతం మంది ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్ల వివరాలను లెక్కగట్టి బుధవారం సాయంత్రం ఎన్నికల విభాగం వివరాలు వెల్లడించింది.

ఆ సర్కిళ్లు పరిశీలిస్తే..

పటాన్‌చెరు సర్కిల్‌ వరుసగా రెండోసారి అత్యధిక పోలింగ్‌(65.09)కు చిరునామాగా నిలిచింది. హయత్‌నగర్‌ సర్కిల్‌లో 51.6శాతం, గాజులరామారంలో 53.65శాతం నమోదైంది.

అతిపెద్ద డివిజన్‌లో మహిళా చైతన్యం..

ఎన్నికలు జరిగిన 149 డివిజన్లలో 9 చోట్ల మాత్రమే మహిళల పోలింగ్‌ శాతం పురుషులకన్నా ఎక్కువ నమోదైంది. ముఖ్యంగా 79,579 మంది ఓటర్లతో అతి పెద్ద డివిజన్‌గా అవతరించిన మైలార్‌దేవ్‌పల్లిలో చాలా మంది మహిళలు ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అక్కడ 44.96శాతం మంది పురుషులు ఓటేయగా, 49.78శాతం మంది మహిళలు వేశారు.

చర్చల్లో మైలార్‌దేవ్‌పల్లి

ఈఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లతో అతి పెద్ద డివిజన్‌గా అవతరించిన మైలార్‌దేవ్‌పల్లి.. మరోసారి చర్చలో నిలిచింది. ఇక్కడ పురుషులు, మహిళా ఓటర్లుకాకుండా ఇతరులు ముగ్గురున్నారు. ఆ విభాగం నుంచి ఓటు మాత్రం 8మంది వేసినట్లు అధికారులు తమ నివేదికలో తెలిపారు. దాంతో ఇతరుల విభాగంలో మైలార్‌దేవ్‌పల్లి 266.67శాతం పోలింగ్‌ను రికార్డు చేసింది.

బస్తీలు బలపరిచాయ్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో బస్తీలు తమ చైతన్యాన్ని చాటాయి. అక్కడి ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఓటు వేశారు. నగరంలో 1,400 వరకు గుర్తింపు పొందిన బస్తీలు, మురికివాడలు 80 డివిజన్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. అంబర్‌పేట, గోల్నాక, దత్తాత్రేయనగర్‌, మంగళ్‌హాట్‌ పరిధిలో బస్తీలలో 50శాతం మించి ఓట్లు పడ్డాయి. అడ్డగుట్టలో 47.52శాతం, పాతబోయిన్‌పల్లిలో 48.72 శాతం పోలింగ్‌ నమోదైంది. కాలనీలు, అపార్టుమెంట్లు ఎక్కువగా ఉండే విజయనగర్‌కాలనీ(37.90శాతం), మాదాపూర్‌(38.64), మియాపూర్‌(36.25), చందానగర్‌లో 39.40 శాతమే నమోదైంది.

చోటామోటా నాయకుల వల్లే..

బస్తీల్లో ఎక్కువగా ఉండే చోటా మోటా నాయకులు ఏదో ఒక పార్టీకి అనుబంధంగా కొనసాగుతుంటారు. పోలింగ్‌ రోజున తమ పార్టీకి ఓటేయించాలనే ఉద్దేశంతో ఓటర్లను కేంద్రాలకు తీసుకొస్తుంటారు. వాహన సౌకర్యం ఏర్పాటుచేసి మరీ తరలిస్తారు. కానీ మధ్యతరగతి వారు, ధనికులు ఉండే కాలనీలు, అపార్టుమెంట్లలో మాత్రం ఆ చొరవ లేదు. కాలనీ, అపార్టుమెంట్‌ సంక్షేమ సంఘాలున్నా.. ఎన్నికల్లో ఓటు వేయించే విషయంలో తగినంత కృషి చేయడం లేదన్న అభిప్రాయాలున్నాయి. చాలామంది యువత, ఉద్యోగులు పోలింగ్‌ రోజున సెలవుగా భావించి ఇతర చోట్లకు వెళ్లిపోవడంతో ఓటింగ్‌ శాతం తగ్గిపోతోంది.

అత్యధిక పోలింగ్‌ నమోదైన డివిజన్లు (శాతాల్లో)

ABOUT THE AUTHOR

...view details