కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్- ఐసీఎంఆర్ సంయుక్తంగా చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌కు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా నిమ్స్‌లో ఆరుగురి వాలంటీర్ల నుంచి మంగళవారం రక్త నమూనాలు సేకరించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించింది. క్లినికల్ ట్రయల్స్‌కు దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా.. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు అవకాశం లభించింది.
ఆరుగురి రక్త నమూనాలు సేకరణ
కొద్దిరోజులుగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారి కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసీయూ వార్డు సిద్ధం చేశారు. మంగళవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆరుగురు వాలంటీర్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని దిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కి పంపారు. అక్కడ పరీక్ష కేంద్రంలో ఈ నమూనాలను పరిశీలించి నిమ్స్‌కు నివేదిక పంపుతారు. వారిలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిపై తొలుత ఒక డోసు వ్యాక్సిన్ ప్రయోగిస్తారు.