ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించే చోట 22 మీటర్ల లోతున 150 మీటర్ల వెడల్పున 3 చోట్ల ఏర్పడిన నదీగర్భం కోత.. ప్రాజెక్టు పనులకు సవాలుగా మారిన విషయం తెలిసిందే. ఇలా కోసుకుపోవడానికి భారీ వరద, ప్రకృతి వైపరీత్యమే కారణమని అన్వయిస్తూ వైఫల్యాన్ని ప్రకృతిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు కారణం ప్రకృతి కాదని, మానవ వైఫల్యమేనని హైదరాబాద్ ఐఐటీ బృందం తేల్చి చెప్పింది. ఎగువ కాఫర్ డ్యాంలో నీరు దిగువకు వెళ్లేందుకు వదిలిన రెండు గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడంవల్లే ఈ విధ్వంసం జరిగిందని కుండ బద్దలుకొట్టింది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గల కారణాల్లో ప్రకృతిపరంగా ఎదురైన సవాళ్లను కమిటీ విశ్లేషించింది. మానవమాత్రులు ఏమీ చేయలేని అంశాలను ప్రస్తావిస్తూ కొవిడ్ పరిస్థితులను ప్రస్తావించింది. అలాగే గోదావరి నదీ విధ్వంసం, కోత అంశాలను ప్రస్తావించింది.
ఎగువ కాఫర్‌డ్యాం వద్ద ఇసుక కోత తాము అధికారంలోకి రాకముందే ఉందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. 2019 మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2020 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అప్పటివరకూ కూడా... ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఉన్న గ్యాప్‌లను పూడ్చలేదు. ఇదే ప్రధాన డ్యాం వద్ద కోతలకు కారణమైందన్న విషయాన్ని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇటీవల ‘పోలవరంలో ఎవరిదీ వైఫల్యం’ అనే శీర్షికన ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది.