'పోలీసు బదిలీల్లో అక్రమాలు జరగలేదు' తెలంగాణలో పోలీసు బదిలీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని.... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు స్పష్టం చేశారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలని అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్ అన్నారు. తప్పుడు వార్తలపై న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, తెలంగాణలో ఎన్నికల విధుల్లో రాజకీయ జోక్యం జరగలేదని కేంద్ర సంస్థలు కూడా వెల్లడించాయని గుర్తు చేశారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు లేవని చెప్పారు.
తెలంగాణ పోలీసుశాఖకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందన్నారు. పోలీస్‌శాఖలో ఒకరిద్దరు తప్పుచేస్తే అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. తప్పు చేసిన పోలీసులపై శాఖాపరంగా వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సభలకు అనుమతి విషయంలో పారదర్శకత పాటిస్తున్నామని సీపీలు తెలిపారు. అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. మరోసారి బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:"12 మంది రైతులకు 'పద్మ' రావడం గొప్ప విషయం"