'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్'గా హైదరాబాద్ - telangana minister ktr
12:53 February 18
ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌గా ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్
విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్ కీర్తిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. హైదరాబాద్ నగరం 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్' గా గుర్తింపు సాధించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేసే అర్బోర్ డే ఫాండేషన్ హైదరాబాద్‌కు ఈ బిరుదునిచ్చింది. హైదరాబాద్‌తో పాటు 63 దేశాల్లోని 120 నగరాలు గ్లోబల్‌గా ఈ గుర్తింపు దక్కించుకున్నాయి. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు ఈ జాబితాలో స్థానం సంపాదించగా.. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది.
పచ్చదనం, గ్రీనరీ లో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న భాగ్యనగరానికి ఈ గుర్తింపు దక్కడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో ఈరకమైన గుర్తింపు సాధించిన ఏకైక నగరంగా హైదరాబాద్ నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలకు దక్కిన ఫలితం ఈ గుర్తింపు అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
అర్బన్ కమ్యూనిటీ ఫారెస్ట్రీ వైపు అడుగులు వేసినందుకు హైదరాబాద్‌ను ట్రీ సిటీగా గుర్తించామని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షుడు డాన్ లాంబే అన్నారు. భవిష్యత్ తరాలకు మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు నగరం అధిక ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. నగరంలో కొత్తగా రెండు కోట్ల 40 లక్షల పైచిలుకు మొక్కలు నాటడం, ఇందుకోసం 200 గంటల సేవా సమయాన్ని కేటాయించడం అభినందనీయమని లాంబే కొనియాడారు.
- ఇదీ చూడండి :లక్ష్య సాధనకు ప్రేరణే దివిటీ!