ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్మిక సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన సెగలు కొనసాగనున్నాయి. తెదేపా నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు నేడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంఘీ భావం తెలుపనున్నారు. పల్లా దీక్షకు ట్విట్టర్ వేదికగా మద్దతు తెలిపిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే అన్నివర్గాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో...
విశాఖ ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి నిరవధికంగా నిరాహార దీక్షలు జరగనున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కూర్మన్నపాలెం కూడలి వద్ద మాజీ మంత్రి, తెదేపా నేత గంటా శ్రీనివాసరావు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ వేదిక నుంచి తన ఎమ్మెల్యే పదవి రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో పంపించనున్నారు.