హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావు వదినా?’’ ఫంక్షన్ హాల్లో కనబడిన దూరపు బంధువు సరోజనమ్మను దగ్గరగా వెళ్లి పలకరించింది సురేఖ.
భర్త సురేందర్‌తో కలిసి బంధువుల అమ్మాయి వివాహ వేడుకకు ఉమాశంకర్ ఫంక్షన్‌హాల్‌కి వచ్చింది సురేఖ.
‘‘జగిత్యాలకు పొద్దున్నే వచ్చాను. ఎన్నాళ్లైంది మనం కలుసుకుని... బాగున్నావా వదినా?’’ కుశల ప్రశ్నలు వేసింది సరోజనమ్మ.
ఆప్యాయంగా ఆమె చేతిలో రెండుచేతులూ కలుపుతూ తలాడించింది సురేఖ. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.
‘‘ఏమంటున్నాడు మనవడు?’’
‘‘పది నెలలు నిండాయి కదా! ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతున్నాడు. కొడుకూ కోడలూ మొన్న పండక్కి వచ్చి వారం రోజులుండి వెళ్లారు వదినా’’ అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపెంగా చెప్పుకుంది సురేఖ.
మాటల సందర్భంలో ‘‘చెప్పడం మర్చి పోయాను... పదిరోజుల క్రితం వెస్ట్ మారేడ్‌పల్లి సీతాయమ్మ చిన్న మనవరాలి వరపూజలో మీ పెద్ద వియ్యంకురాలు కలిసింది. కూతురు స్తోత్ర వాషింగ్ మిషను కొనిచ్చిందని తెగ సంబరపడుతూ చెప్పిందనుకో’’ అంది ఆవిడ.
ఆ మాట విన్న సురేఖ కుతకుతలాడిపోయింది.
ఆ తర్వాత సరోజనమ్మ ఏం చెబుతున్నా చెవికి ఎక్కలేదు. ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదికి వెళ్లాయి. ఆరోజు- ‘‘కోడలు పిల్ల వ్యవహారం నాకేం నచ్చడం లేదురా’’ పెద్దకొడుకు అలోకిత్ మీద అంతెత్తున ఎగిరిపడింది సురేఖ.
‘‘ఏం చేసిందమ్మా’’
అన్నాడు అలోకిత్.
‘‘చేయాల్సిందంతా చేసి... ఇంకా ఏం తెలియనట్టు నన్నడుగుతావేం?’’ రుసరుస లాడింది సురేఖ.
‘‘అమ్మా, ఏదైనా ఉంటే స్ట్రెయిట్‌గా మాట్లాడు. ఈ డొంకతిరుగుడు దేనికమ్మా’’ చాలా కూల్‌గా అడిగాడు అలోకిత్.
‘‘అలా గుండ్రాయిలా పేపర్ ముందేసుకుని కూర్చోకపోతే మాట్లాడొచ్చుగా’’ భర్తవంక కోపంగా చూసింది సురేఖ.
‘‘తల్లీ కొడుకులిద్దరూ మాట్లాడు కుంటున్నారుగా... మధ్యలో నేనెందుకట?’’ నన్ను లాగకండి అన్నట్టు తిరిగి పేపర్లో తల దూర్చాడు సురేందర్.
‘‘మీతో నాకెప్పుడూ ఇంతే. ఏదీ పైకి అనరు. అనవసరంగా నన్ను ముందుకు తోస్తుంటారు. పిల్లలముందు డాడీ మంచోడు, అమ్మ చెడ్డది అవుతోంది’’ భర్త మీద కోపం ప్రదర్శించింది.
‘‘మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్లం అవడం ఏమిటి సురేఖా? అయిన దానికీ కాని దానికీ నువ్వే అనవసరంగా ఆవేశపడుతుంటావు. ఆ తర్వాత, ఇలా ఎందుకు అన్నానా అని బాధ పడుతుంటావు. నీకిది మామూలేగా’’ భార్యను సముదాయించే ప్రయత్నం చేశాడు సురేందర్.
‘‘మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా. మీరు కలుగజేసుకోనప్పుడు అన్ని పనులూ చక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా’’ అంది ఉక్రోషంగా.
ల్యాప్‌టాప్ మీద కదులుతున్న చేతివేళ్లను ఆపి ‘‘అమ్మా చిన్నదానికీ పెద్దదానికీ అనవసరంగా హైరానాపడతావెందుకు? ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నయ్యకు తెలియదా. తనేమైనా చిన్న పిల్లోడా? పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇరవై మంది ఉన్న ఒక బ్యాచ్‌కి లీడర్. వదిలేయ్’’ అన్నాడు చిన్నకొడుకు అన్విత్.
‘‘నోర్ముయ్, నువ్వు జాబ్‌లో చేరి మూడు నెలలు అయిందో కాలేదో, అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా?’’ చిన్న కొడుకు మీద గయ్‌మని లేచింది సురేఖ.
విషయం తేలేదాకా అమ్మ మొండిపట్టు వదలదని ఎరిగిన అన్విత్ తిరిగి తన ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ అయిపోయాడు.
‘‘మొన్న మా చిన్న తమ్ముడు సతీష్ మీ అపార్ట్‌మెంటుకి వచ్చాడట కదా?’’ పెద్దకొడుకుని ఆరా తీసింది సురేఖ.
‘‘అవును, వాళ్ల అబ్బాయిని హైదరాబాద్ బౌరంపేట చైతన్య క్యాంపస్‌లో ఇంటర్‌లో జాయిన్ చేయడానికి వచ్చాడట. వెళుతూ మన చిన్నోడిని చూసిపోదామని వచ్చాడు. బలవంతం చేస్తేనే చిన్న మామయ్య నా దగ్గర భోంచేసి వెళ్లాడు.’’
‘‘అదికాదు నేను అడిగేది.’’
‘‘మరి నాకు తెలియనిది, నేనెలా చెప్పాలమ్మా’’ అలోకిత్ గొంతులో కాస్త అసహనం చోటు చేసుకుంది.
‘‘మీ అత్తామామలు ఇద్దరూ నీ దగ్గరే ఉంటున్నారటగా’’ అడిగింది.
అమ్మ మనసులోని మాట బయటపడేసరికి ‘‘అవును, వాళ్లు మా అపార్ట్‌మెంట్‌కి వచ్చి నెల అవుతోంది’’ జవాబిచ్చాడు అలోకిత్.
‘‘ఇంతవరకూ మాకా విషయం చెప్పనేలేదేం?’’ సూటిగా ప్రశ్నించింది సురేఖ.
‘‘ఇందులో చెప్పడానికి ఏముందమ్మా?’’ ఆశ్చర్యపోయాడు అలోకిత్.
భర్త వంక చూస్తూ ‘‘చూశారా మీ పెద్దకొడుకు నిర్వాకం... మనకు చెప్పాల్సిన పనే లేదట’’ అంది నిష్టూరంగా.
భార్య అనవసరంగా సాగతీయడం నచ్చని సురేందర్ ‘‘ఇప్పుడు చెప్పాడుగా సురేఖా’’ అంటూ కొడుకుని సమర్థించాడు.
‘‘ఆఁ... అడిగితే చెప్పాడు లెండి. అయినా ఎన్నాళ్లుంటారట?’’ తిరిగి కొడుకుని ప్రశ్నించింది.
‘‘చిన్నోడు వాళ్ల అమ్మమ్మకి బాగా మాలిమి అయ్యాడమ్మా. స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసుకుంటోంది... వాడి నుంచి ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా’’ క్లియర్‌గా విషయం చెప్పాడు అలోకిత్.
అదేమీ పట్టించుకోకుండా ‘‘నేను అడిగిన దానికి సమాధానం రాలేదు. వాళ్లిద్దరూ నీ దగ్గర ఎన్నాళ్లు ఉంటారు? తిరిగి రెట్టించింది.
‘‘చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్లా పడుతున్నాడు కదమ్మా. వాళ్లమ్మ సహాయం లేకుండా, అటు జాబ్‌నీ ఇటు పిల్లాడినీ వంటపనుల్నీ స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది. నేను ఎంత స్తోత్రకి సహాయపడుతున్నా మా ఇద్దరి వల్లా కావడం లేదమ్మా. ఉండనీ, ఎన్నిరోజులని ఏముంది?’’ తల్లికి నచ్చచెప్పాడు అలోకిత్.
‘‘ఇదేమైనా అమెరికానా అత్తమామల్ని రప్పించుకుని ఇంట్లో ఉంచుకోవడానికి, మన బంధువులు నలుగురూ నానా మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తోంది’’ అసహనం వ్యక్తం చేసింది.
‘‘ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏముందమ్మా? వాళ్లెవరో ఈ ఇష్యూ గురించి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది.’’
‘‘మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు పదిమంది పలు రకాలుగా అనుకోవడంలో తప్పేముంది.’’
అమ్మ అర్థం చేసుకోలేకపోవడం, దీన్ని రాద్ధాంతం చేయడం నచ్చడం లేదు అలోకిత్‌కి.
‘‘పోనీ, ఆ పది మంది ఎవరో వచ్చి స్తోత్రకు హెల్ప్ చేయమను. వాళ్ల పేరెంట్స్ ఇద్దరూ వెనక్కి వెళ్లిపోతారు’’ అన్నాడు గట్టిగా.
కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండడం గమనించిన సురేఖ ‘‘అది కాదు నాన్నా, మీరిద్దరూ ఎలాగూ ఒంటరిగా ఉంటున్నారు. వాళ్లు మీ ఇంటికి వచ్చి ఉండడం కాకుండా మిమ్మల్నే తీసుకెళ్లి వాళ్లింట్లోనే ఉంచుకోవచ్చు కదా. వాళ్లకు మాత్రం స్తోత్ర తప్ప ఎవరున్నారు?’’ అంది నింపాదిగా.
ఆమె తన ఆలోచనను కొడుకు ముందు వ్యక్తపరచడంతో ‘‘ఆ ఇంట్లో ఈ ఇంట్లో అని ఏముందమ్మా? ఎక్కడైనా ఒకటేగా. పైగా మా ఇద్దరి ఆఫీసులకూ దగ్గరనే కదా సిటీకి అంత దూరంగా అపార్ట్‌మెంట్ తీసుకుని ఉంటున్నది’’ అన్నాడు.
‘‘అమ్మ చెబితే వింటావనుకున్నాను. ఏమో, ఈ మధ్య నేను ఏది చెప్పినా నీకు చెవికి ఎక్కడం లేదు’’ అంది నిరసనగా.
‘‘ఎందుకమ్మా అనవసరంగా అపోహ పడతావు. నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? స్తోత్ర నాకు అన్నివిధాలా సరిజోడీ అని నువ్వు నిర్ణయించాకే కదా నేను తలూపాను. నువ్వు సెలెక్ట్ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకున్నది’’ తల్లిని కూల్ చేయబోయాడు.
‘‘అది పెళ్లికి ముందు సంగతి. ఇప్పుడలా జరగడం లేదులే. నీకెలా తోస్తే అలా చేసుకుంటున్నావు’’ మొహం ముడుచుకుంది సురేఖ.
‘‘ఇప్పుడూ ఎప్పుడూ ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది. నువ్వేం వర్రీ అవకు అమ్మా. ఇప్పుడే స్తోత్రకి ఫోన్ చేసి వాళ్ల అమ్మానాన్నలని వాళ్లింటికి పంపించేయమంటాను. నేను కూడా హైదరాబాద్ వెళ్లి స్తోత్రను వెంటనే జగిత్యాలకు తీసుకువస్తాను.
మా ఇద్దరికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ కదా, నో ప్రాబ్లమ్... ఆఫీస్ పని ఎక్కడైనా చేసుకుంటాం. అయితే పిల్లాడిని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి’’ అంటూ తల్లిని ఇరకాటంలో పడేశాడు అలోకిత్.
కొడుకు మాటలకు కంగారు పడింది సురేఖ.
‘‘అదెలా కుదురుతుందిరా... చిన్నోడితో అంత టైం స్పెండ్ చేయడానికి నేనేం ఖాళీగా ఉండడం లేదు కదా. ఇక్కడ ఇంత పెద్ద వర్కు నడుస్తోంది. అన్నీ తెలిసే అలా అంటావేంటి?’’
‘‘మరి నీకూ వీలుపడక- వాళ్లనూ రావద్దంటే పిల్లాడిని ఎవరు చూడాలి? వాళ్లేం తినడానికి లేక రాలేదు. వాళ్ల పనులన్నీ పక్కన పెట్టి మరీ మాకోసం వచ్చారు. చిన్నోడి బాగోగులు చూసుకుంటున్నారు.’’
‘‘ఆఁ అర్థమైంది. పిల్లాడి మీద నాకూ మీ నాన్నకూ ప్రేమ లేదు. మీ అత్తామామలే మంచివాళ్లని చెబుతున్నావు, అంతేగా’’ అంటూ విరుచుకు పడింది సురేఖ.
తల తిప్పకుండానే ఓరకంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్.
అన్విత్ వాళ్ల మాటల్ని వినకుండా తన ఆఫీసు పనిలో నిమగ్నమైపోయాడు.
ఇది ఇప్పట్లో తెగేలా లేదని ‘‘అమ్మా అనవసరంగా అన్నీ నెగటివ్‌గా ఊహించుకోకు. నాకు నీ తర్వాతే స్తోత్ర అయినా మరెవరైనా. అది గుర్తుపెట్టుకో’’ అంటూ తల్లిని కట్టిపడేశాడు అలోకిత్.
మరేం మాట్లాడలేదు సురేఖ.
‘‘ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కి వెళ్తానమ్మా’’ తల్లికి చెప్పాడు అలోకిత్.
‘‘సరేగానీ, ఈసారి పండక్కి మాత్రం కోడలిని తప్పక తీసుకురా... చిన్నోడిని చూడాలనిపిస్తోంది.’’
‘‘ఒకటి రెండు రోజుల కోసం స్తోత్ర ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమో? అయినా వీడియోలో రోజూ వాడిని చూస్తూనే ఉన్నావు కదా’’ కొడుకు మాటలకు చురుక్కుమంది సురేఖకు.
‘‘అవును మరి... మీరుంటున్నది అమెరికాలో, మేముంటున్నది ఇండియాలో. అక్కడ హైదరాబాదులో కారు కదిలిందంటే మూడున్నర గంటలకల్లా జగిత్యాల చేరుకుంటారు. పండక్కి కూడా కోడలూ, మనవడూ నా దగ్గర ఉండకపోతే ఎలా? ఉండనీ ఇక్కడే పది, పదిహేను రోజులు.’’
‘‘మరి వాళ్ల అమ్మానాన్నలని కూడా రమ్మననా... స్తోత్రకి ఆఫీసుపని ఉంటుంది’’ అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు.
భార్య చూడకుండా భుజాలు ఎగురవేశాడు సురేందర్.
‘‘నీ కంటికి నేనెలా కనబడుతున్నాన్రా... ఆ మాత్రం పదిరోజులు పిల్లావాడిని నేను చూసుకోలేనా?’’ కొడుకుని గదమాయించింది సురేఖ. అలోకిత్ నిశ్శబ్దమై పోయాడు.
‘‘కోడలికి ఇష్టమని బూందీ లడ్డూలూ, నీకు ఇష్టమైన సన్న కారప్పూసా చేయించాను. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు నాన్న. లగేజీ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ.
‘‘అలాగేనమ్మా, నాతో చెప్పడం దేనికి... అవన్నీ కార్లో సర్దించు. ఈలోగా ఫ్రెండ్స్‌ని కలిసి వస్తాను’’ అంటూ బైక్ తీసుకుని బయటకు నడిచాడు అలోకిత్.
పక్కన ఏదో శబ్దం కావడంతో ఆలోచనల్లోంచి బయటపడింది సురేఖ. మాంగల్యధారణ పూర్తయి, వధూవరులను ఆశీర్వదించడానికి జనం వేదిక వైపు కదులుతుండడంతో సరోజనమ్మకి ‘బాయ్’ చెప్పి భర్త దగ్గరకు వెళ్లింది.
* * *