Hyderabad book Fair: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలివస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించడంతో... పెద్దఎత్తున వచ్చి నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 260 స్టాళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తక ప్రియులతో కళకళలాడుతున్నాయి. గతంలో కంటే ఈసారి స్టాళ్ల సంఖ్య తగ్గినా... సందర్శకుల సంఖ్య మాత్రం పెరిగింది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకువచ్చి పుస్తకాలు కొనిస్తున్నారు. పుస్తక పఠనం పట్ల పసి వయసు నుంచే అవగాహన కల్పిస్తున్నారు.
రెండున్నర లక్షల పుస్తకాలు..
పుస్తక ప్రదర్శనలో తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో సుమారు రెండున్నర లక్షలకుపైగా వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ముంబయి, దిల్లీ, కోల్‌కతా, మద్రాసుకు చెందిన పలువురు పబ్లిషర్లు ఈ ప్రదర్శనలో పుస్తకాలు విక్రయిస్తున్నారు. చరిత్ర, సాహిత్యం, జీవిత చరిత్రలు, విజ్ఞాన, వికాసం సహా సాంకేతిక విజ్ఞాన పుస్తకాలనూ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.