బల్దియా ఎన్నికలు డిసెంబరు 1న 150 డివిజన్లలో జరగనున్నాయి. మొత్తం 74 లక్షల పైచిలుకు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5-10 డివిజన్ల వరకు ఉన్నాయి. ఇంతవరకు ఏ గ్రేటర్ ఎన్నికలోనూ దాదాపు 45 శాతానికి మించి పోలింగ్ జరగలేదు. వివిధ కారణాల వల్ల ఈదఫా కూడా ఓటింగ్ తక్కువ నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రతి ఓటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
అందరిదీ అదే లక్ష్యం..
అధికార తెరాస గత ఎన్నికల్లో మాదిరిగానే ఫలితాలు సాధించి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఇక భాజపా విషయానికొస్తే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తమకు అనుకూలంగా రావడంతో బల్దియాలో బలాన్ని ప్రదర్శిస్తే భవిష్యత్తులో పార్టీ బలోపేతం కావడానికి ఉపకరంగా ఉంటుందని భావిస్తోంది. మొన్నటి బల్దియా ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి మరికొన్ని స్థానాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎంఐఎం పాతబస్తీలోనే కాకుండా ఇతర డివిజన్లలోనూ జెండా ఎగుర వేయాలని లక్ష్యం పెట్టుకొంది. కొన్ని స్థానాల్లో తెలుగుదేశం కూడా పోటీని ఇస్తోంది. అన్ని పార్టీలు ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్నాయి. స్థానికంగా పట్టున్న నాయకులను గుర్తించి పలు పార్టీలు వారికి ముందుగానే డబ్బు ఇస్తున్నాయి. వారి ఆధ్వర్యంలోనే ఒకటి రెండు రోజుల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాలని తలపోస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపైనా వల విసిరి మచ్చిక చేసుకుంటున్నాయి.
భారీ నివాస సముదాయాలకు వెళ్లి..
కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోనూ, పెద్ద అపార్టుమెంట్లలోనూ వారికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ.లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. కూకట్‌పల్లిలో ఓ అపార్టుమెంట్ వారికి తాగునీటి కనెక్షన్ సామర్థ్యం పెంచుకోవడానికి రూ.4.5 లక్షల వ్యయమవుతుందని అంచనావేశారు. ప్రచారానికి వచ్చిన ఓ నేత ఆ డబ్బును అసోసియేషన్ పెద్దలకు అందజేశారు. నివాసితులతో సమావేశం పెట్టి డబ్బు తీసుకున్న పార్టీకే ఓట్లు వేయాలంటూ ఒప్పించినట్లు తెలిసింది. రెండో దశ కింద ఓటర్లకు రూ.200 నుంచి రూ.2000 వరకు అందించడానికి కొందరు నేతలు సిద్ధం చేసుకుంటున్నారు.