రాష్ట్రంలో కరోనా మొదటి కేసు నమోదైన తొలినాళ్లలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మర్కజ్ యాత్ర నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. అనంతరం జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలపైనే మహమ్మారి అధిక ప్రభావం చూపింది. పట్టణ ప్రాంతాలు కావటం, ఉపాధి సహా అనేక కారణాలతో ఆయా జిల్లాలకు పెద్దఎత్తున ప్రజలు రాకపోకలు సాగించడం వల్ల వైరస్ విజృంభణ అధికంగా ఉండేది.
సెకండ్ వేవ్‌లో తీరు మారింది..
అయితే రెండో దశకు వచ్చేసరికి తీరు మారింది. సరిహద్దు జిల్లాలపై మహమ్మారి పంజా విసిరింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా ప్రాంతాల నుంచి రాకపోకలు అధికంగా సాగే సరిహద్దు జిల్లాల్లో కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలలో వైరస్ విలయతాండవం చేయడం వల్ల సర్కారు కట్టడి చర్యలు చేపట్టింది. లాక్డౌన్ సహా కట్టుదిట్టమైన నిబంధనలు అమలుచేసింది. ఫలితంగా జూన్ మొదటి నుంచే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజుల నుంచి వెయ్యిలోపే కరోనా కేసులు నమోదవుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది.
పలు జిల్లాల్లో ఇంకా ప్రభావం..
ప్రభుత్వ చర్యలు నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య స్వల్పంగా ఉండటం హర్షించాల్సిన విషయం. అయినా.. పలు జిల్లాల్లో కొవిడ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించటం లేదని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. మరో ఏడు జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది.