అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్ర నలువైపులా మినీ పట్టణాలు ఏర్పాటు చేయాలన్న హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ సంకల్పానికి... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.
భూ సమీకరణ ద్వారా అత్యాధునిక వెంచర్లు వేసి అందులో భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే ఆరుచోట్ల తమ భూములు సమీకరణ కింద ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా స్థిరాస్తి వ్యాపారం రాష్ట్రంలో ఊపందుకున్నందున... రాష్ట్రంలో అనేక వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండానే అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు వేసి ఇళ్ల స్థలాలను అమ్మేస్తున్నారు.
ఆ తర్వాత వివిధ వివాదాల వల్ల ఈ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే అవకాశం లేకపోవడం వల్ల వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెచ్‌ఎండీఏ వెంచర్లు వేస్తే ఈ ఇబ్బంది ఉండదని అనేకమంది ఈ సంస్థపై గత కొన్నేళ్లగా ఒత్తిడి తెస్తున్నారు.
50 ఎకరాలు ఇస్తే...
ఉత్తర్‌ప్రదేశ్‌లో నగరాభివృద్ధి సంస్థ భూసమీకరణ ద్వారా మినీ పట్టణాలను విజయవంతంగా నిర్మిసోంది. అదే తరహాలో హెచ్‌ఎండీఏ పరిధిలోని... హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది.
పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత అందులో స్థలాలను భూములు ఇచ్చిన వారికి ఇస్తామంటూ అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేశారు. ఎక్కడైనా 50 ఎకరాలు.. ఆపైన ఈ ఇస్తే చాలు వెంచర్ వేయడానికి సిద్ధమని అధికారులు ప్రకటించారు.
ముందుకొస్తున్న రైతులు
రంగారెడ్డి జిల్లా మోకిల, మేడ్చల్ జిల్లా కొర్రేముల, ప్రతాపసింగారం గ్రామాల్లో వంద ఎకరాల నుంచి 250 ఎకరాల వరకు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారు. అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.