హైదరాబాద్ కోకాపేట్ భూములపై ప్రజలను సీఎన్ఎన్ వెంచర్స్ అనే సంస్థ మోసం చేస్తోందని హెచ్ఎండీఏ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ కోకాపేట్ లే-అవుట్లో భూముల ఆన్లైన్ వేలం ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. దీనిని సాకుగా చూపి అమాయక ప్రజలను వారు మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్ భూముల ఆన్లైన్ వేలం ప్రక్రియ పూర్తి కాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సీఎన్ఎన్ వెంచర్స్ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్నారని హెచ్ఎండీఏ ఆరోపిస్తోంది. కోకాపేట్ భూములను మార్కెట్ విలువలో యాబై శాతం పెట్టుబడులతో 1,500 చదరపు అడుగుల 3 బీహెచ్‌కే ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వెంచర్స్ ప్రకటనల ద్వారా అమాయక ప్రజలను వంచనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
KOKAPET LANDS: సీఎన్ఎన్ వెంచర్స్‌పై పోలీసులకు హెచ్ఎండీఏ ఫిర్యాదు - telangana varthalu
సీఎన్ఎన్ వెంచర్స్ అనే సంస్థ కోకాపేట భూములపై అమాయక ప్రజలను మోసం చేస్తోందని హెచ్ఎండీఏ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎన్ఎన్ వెంచర్స్ పత్రికల్లో ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటనలు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్ఎండీఏ ఆరోపించింది. సీఎన్ఎన్ వెంచర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఒకవైపు కోకాపేట్ భూముల ఆన్లైన్ వేలం ప్రక్రియ కొనసాగుతుండగా.. అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సీఎన్ఎన్ వెంచర్స్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ సెక్రటరీ సంతోష్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ భూముల వేలం పూర్తికాక ముందే నిర్దిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్ వెంచర్స్ పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండీఏ ప్రతిష్ఠను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తపాలా కార్యాలయాల ద్వారా పూర్తిస్థాయి పాస్‌పోర్టు సేవలు