హైదరాబాద్ గోల్కొండ కోట ప్రధాన ద్వారం నుంచి ఫతేదర్వాజ, కుతుబ్‌షాహీ టూంబ్స్ మార్గం వైపు.. ప్రహరీని ఆనుకొని వందలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఆ వైపు ట్రాఫిక్ స్తంభిస్తోంది. గతంలో ఫతేదర్వాజ వద్ద కమాన్ గోడను కూల్చేసి రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ నిర్మాణాన్ని కూల్చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గోల్కొండ పరిసరాల్లో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా పురావస్తుశాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోవాలి. జీహెచ్‌ఎంసీ, జలమండలి నుంచి అనుమతి తీసుకొని రోడ్లు, తాగునీటి నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఇక్కడి నిర్మాణాలు ఏవీ అనుమతులు పొందిన దాఖలాలు లేవు.
సమాధుల పక్కనే వ్యాపారం
170 ఏళ్ల పాటు సాగిన కుతుబ్‌షాహీ పాలనలోని ఏడుగురు పాలకులకు గుర్తుగా వారి వారసుల సమాధులను ఒకే ప్రాంగణంలో నిర్మించారు. వంశస్థుల సమాధులు ఒకే చోట ఉండటం ఇక్కడ మినహా ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. సమాధులున్న ప్రాంతంలో కొంత భూమికి తాము హక్కుదారులమని కొందరు స్థానికులు గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కొందరు ఇసుక వ్యాపారం చేపడుతున్నారు.
20 ఎకరాలు ఏమైనట్టు..!
ఆస్మాన్‌గఢ్‌లో కొండపై 18వ శతాబ్దంలో స్మారక స్తూపాన్ని నిర్మించారు. నిజాం పాలనలో ఫిరంగి సేనలను తీర్చిదిద్దిన ఘనచరితలో ఫ్రెంచ్ దేశస్థుడైన జనరల్ మాన్సియర్ రేమండ్ కృషి ఉంది. ఆయన స్మారకంగా దీన్ని నిర్మించారని చెబుతారు. రేమండ్ సంబంధికుల సమాధులు ఇక్కడున్నాయి. 27.20 ఎకరాల ఈ ప్రదేశం కబ్జాలతో 7.20 ఎకరాలకే పరిమితమైంది.