గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియను నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన ఎనిమిది వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఇంటర్వ్యూ పక్రియ వాయిదా పడింది.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి. గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూయేషన్ చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.