మూసీ అభివృద్ధి అభివృద్ధి పనుల్లో భాగంగా అధికారులు ఓసారి గుజరాత్ వెళ్లి... సబర్మతి నదీ అభివృద్ధి మండలి చేపట్టిన పనులను పరిశీలించి రావాలని ప్రభుత్వానికి సూచించింది. అక్కడ చేపట్టిన పనులను ఇక్కడా అమలు చేసే అంశాన్ని పరిశీలించాలంది. సబర్మతి నదీ అభివృద్ధి మండలిలాగే.. మూసీ అభివృద్ధికి ప్రత్యేక అధారిటీని ఏర్పాటు చేసేలా ఆదేశించాలంటూ... ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే.
ఏ చర్యలు తీసుకోలేదు..
ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ , జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... మూసీ నది అభివృద్ధి పనులు ఇప్పటివరకు చేపట్టలేదన్నారు. సబర్మతి నది అభివృద్ధి చేసినట్లుగా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధర్మాసనానికి తెలిపారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం..
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సబర్మతి నదిలాగే ఇక్కడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీంతో పాటు జాతీయ హరిత ట్రైబ్యునల్(NGT)లో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని, ఒకటి సుమోటోగా తీసుకోగా.. మరొకరు పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు మరో రెండు కమిటీలు పనులను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో దీనిపై తదుపరి విచారణ అవసరంలేదంటూ ఎన్జీటీ ఈ ఏడాది ఫిబ్రవరి 22 న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మూసీ అభివృద్ధి కార్పొరేషన్ చేపట్టిన పనులపై నివేదిక రూపొందించి దాఖలు చేసినట్లు చెప్పారు. మురుగు నీటి శుభ్రతకు చేపట్టిన చర్యలతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
ఈ దశలో పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకు కౌంటర్లు ఇవ్వలేదని చెప్పగా... వాటిని అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు మొదటి వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇదీ చూడండి: