ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న పెండింగ్ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని ప్రత్యేక న్యాయస్థానాలను హైకోర్టు ఆదేశించింది.
సీబీఐ, ఏసీబీ, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలపైనున్న కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరపాలని స్పష్టం చేసింది.
అన్‌లాక్ విధానం..
నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్ విధానాన్ని ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హైకోర్టులో ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్‌తో పాటు.. న్యాయవాదులు కోరితే నేరుగా విచారణ జరుపుతున్నారు. నవంబరు 6 వరకు ఇదే విధానం కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్ జిల్లా, సంగారెడ్డి పట్టణం మినహా మిగతా ప్రాంతాల్లో ప్రాథమికంగా కోర్టులు తెరిచి భౌతికంగా విచారణలు నిర్వహిస్తున్నారు. అదే విధానం కొనసాగించాలని నిర్ణయించింది. హైదరాబాద్ సిటీ, సంగారెడ్డి పట్టణం, సీబీఐ కోర్టు పరిధిలోని ఇతర న్యాయస్థానాలు తెరవాలా.. లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగించాలా అనే విషయం పరిపాలన న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత న్యాయాధికారులను హైకోర్టు ఆదేశించింది.
ఇవీచూడండి:ముసుగులు తొలగించి రాజకీయాల్లోకి నేరగాళ్లు