Son Of India: సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ తిరుపతి పోలీసులకు సినీనటుడు మోహన్ బాబు అభిమానులు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంచు కుటుంబ సభ్యులపై ట్రోల్స్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'ప్రపంచమంతా నా కుటుంబం. ప్రపంచం బాధే నా బాధ' అని సన్ ఆఫ్ ఇండియాలో మంచు మోహన్ బాబు చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఈనెల 18న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయంటూ మంచు ఫ్యామిలీ ఆరోపించింది. స్వయంగా మోహన్ బాబే రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తాననడం చర్చకు దారితీసింది. ట్రోల్స్‌పై మంచు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్ ఆఫ్ ఇండియా సినిమాపై కావాలనే ట్రోల్స్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో మంచు అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.