హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్ దగ్గర వరద నీరు రోడ్డుపైకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు శనివారం తీవ్రంగా శ్రమించారు. ఆ రోజు రాత్రి కురిసిన వర్షాలతో పనులు ముందుకు సాగలేదు. ఆదివారం ఉదయం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నగరం నుంచి విమానాశ్రయానికి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసేశారు. ఓఆర్‌ఆర్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. మరోవైపు విమానాశ్రయం నుంచి నగరానికొచ్చే వాహనాలను యథావిధిగా అనుమతిస్తున్నారు.
వరంగల్ వెళ్లే దారిలో..
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వరదలోనే వాహనాలను ముందుకెళ్తున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా ప్రహరీ నేలకూలడంతో భారీగా వరద నీరు చేరుతోంది. రామంతాపూర్, హబ్సిగూడ కాలనీల నుంచి నల్లచెరువుకు మురుగును తీసుకొచ్చే ట్రంక్‌లైన్(పైపులైన్) ఉప్పల్ ఐడీఏ దగ్గర పగలడంతో ఉద్ధృతి మరింత పెరిగింది. రెండు వైపులా కోతకు గురైన రహదారిపై బారికేడ్లను రక్షణగా ఉంచి ట్రాఫిక్‌ను అనుమతిస్తున్నారు.
విజయవాడ రోడ్డులో నెమ్మదిగా..
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. వరద నీరు భారీగా చేరడంతో ఇనాంగూడ దగ్గర కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జాం అయ్యింది. ఇటు అబ్దుల్లాపూర్‌మెట్, ఇటు కొత్తగూడ దగ్గరే వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరిస్థితి కొంత వరకు అదుపులోకొచ్చింది. కోతకు గురైన రెండు వైపులా బారికేడ్లను అడ్డుగా ఉంచి వాహనాలను అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతోంది. మరమ్మతు పనులు నిలిచిపోయాయి.
ఈ రోడ్లు పూర్తిగా బంద్..
చాలా ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. వరద నీరు పెరుగుతుండటంతో కొన్ని రోడ్లను పూర్తిగా మూసేసి, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. మలక్‌పేట్ ఆర్‌యూబీ, గడ్డిఅన్నారం నుంచి శివగంగా రోడ్డు, మూసారాంబాగ్ వంతెన-చాదర్‌ఘాట్ రోడ్డు, పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు, టోలిచౌకీ ఫ్లైఓవర్ కింద, మొగుల్ కాలేజ్-ఫలక్‌నుమా బండ్లగూడ నుంచి ఆరాంఘర్ రోడ్డు - పూల్‌బాగ్, మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్డు నుంచి ఐఎస్ సదన్(డీఎంఆర్‌ఎల్ ఎక్స్ రోడ్డు వరకు), ఫలక్‌నుమా రైల్వే వంతెన రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదు.