నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీరం దాటే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులు, పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు(ap rains) కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. రేపటివరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు..(ap rains today)
చిత్తూరు జిల్లా (rains in chittoor)చంద్రగిరి మండలంలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నక్కలేరు వాగు పొంగటంతో పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలతో శ్రీకాళహస్తిలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. వర్షం కారణంగా కొత్తూరులోకి వర్షపు నీరు చేరింది. మూర్తిపాళ్యెం గండి నుంచి దిగువకు వరద నీరు ప్రవాహించడంతో గొల్లపల్లె, కొత్తూరు, కుంటిపూడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.