అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల జనవాసాల్లోకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
కడప జిల్లా..
అల్పపీడన ప్రభావం వల్ల కడప జిల్లాలో రెండు రోజులగా భారీ వర్షాలు(heavy rains in kadapa district) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు రోడ్లు కాలువను తలపిస్తున్నాయి. జిల్లాలోని బుగ్గవంక ఉదృతంగా ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు... బుగ్గవంక ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 1,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు (heavy rains in east godavari district)కురుస్తున్నాయి. అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం,పెద్దాపురం, రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలుకు వరి పొలాలు నేల వాలాయి.
నెల్లూరు జిల్లా
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు(heavy rains in nellore district) కురుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో చెరువులు ప్రమాదకర పరిస్థితికి చేరాయి. సైదాపురం మండలం కలిచేడు గ్రామ చెరువుకు గండిపడి.. నీరంతా వృథాగా పోతోంది. మనుబోలులో కండలేరువాగు ఉరకలేస్తోంది. రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తుండటం వల్ల పెళ్లకూరు మండలంలోని వివిధ గ్రామాలకు రాకపోకలను నిలిపివేశారు.