తెలంగాణ

telangana

ETV Bharat / city

భయం గుప్పిట్లో భాగ్యనగరం.. రహదారులన్నీ జలమయం - హైదరాబాద్ వర్షాలు లేటెస్ట్ న్యూస్

Hyderabad Rains : భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న వరదలతో హైదరాబాద్‌లోని పలుకాలనీలు మరోసారి భయం గుప్పిట్లో గడుపుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.... పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. నగరంలోని చెరువులకు భారీ వరదతో వాటి కింద ఉన్న కాలనీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.

Hyderabad Rains
Hyderabad Rains

By

Published : Jul 23, 2022, 12:43 PM IST

Hyderabad Rains : భాగ్యనగరవాసులను మరోసారి వరుణుడు భయపెడుతున్నాయి. భారీ వానలతో జంటనగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా... రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.... నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటు చూసినా బురద, వరద ఉండడంతో... బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లోని కాలనీలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. కుత్బుల్లాపూర్‌, నిజాంపేట్ ప్రాంతాల్లో జలమయమైన కాలనీలలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద అధికారులతో కలిసి పర్యటించారు.

భారీ వర్షాలకు జీడిమెట్ల పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువుకు భారీగా వరద వస్తోంది. దీంతో చెరువుకు ఎగువన ఉన్న ఉమామహేశ్వరకాలనీ వాసులు మరోసారి భయం గుప్పిట్లో గడుపుతున్నారు. కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఫాక్స్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. అలాగే దుండిగల్ మండల పరిధిలోని బహదూర్ పల్లి గ్రామంలోని బోభాఖాన్ చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పారుతుంది. దీంతో మున్సిపల్ అధికారులు పరిసర వాసులను అప్రమత్తం చేశారు.

భాగ్యనగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కులు కాగా.. నాలుగు గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,786.65 అడుగులు వరకు నీరు చేరింది. హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.... ప్రస్తుతం 1760.50 అడుగులు మేర వరద నీరు చేరింది.

ABOUT THE AUTHOR

...view details