తెలంగాణ

telangana

ETV Bharat / city

Irrigation projects in Telangana : ఈ ఏడాది ప్రాజెక్టులకు భారీ వరద.. 2800 టీఎంసీల నీరు కడలిపాలు

రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదతో ఈ ఏడాది తెలంగాణ ప్రాజెక్టులు(Irrigation projects in Telangana) నీళ్లతో కళకళలాడాయి. ముఖ్యంగా గోదావరిలో మేడిగడ్డ, కృష్ణాలో శ్రీశైలం వద్ద భారీ నీటి లభ్యత నమోదైంది. ఈయేడు నీరు కడలిపాలు కూడా ఎక్కువగానే అయింది. 2800 టీఎంసీల నీరు సముద్రంపాలైంది.

Irrigation projects in Telangana
Irrigation projects in Telangana

By

Published : Oct 25, 2021, 8:16 AM IST

అటు గోదావరిలో మేడిగడ్డ, ఇటు కృష్ణాలో శ్రీశైలం వద్ద ఈ సంవత్సరం భారీ నీటి లభ్యత నమోదైంది. మేడిగడ్డకు అత్యధికంగా 2500 టీఎంసీలకు పైగా రాగా, శ్రీశైలంలోకి వెయ్యి టీఎంసీలు దాటింది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని అన్ని రిజర్వాయర్లలోకి ఇప్పటికీ నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ ముగియనున్నా.. జలాశయాలుIrrigation projects in Telangana పూర్తిస్థాయి నీటిమట్టాలతో తొణికిసలాడనున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతోపాటు ఎగువన అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇందుకు కారణం. ఈసారి కడలిపాలు కూడా ఎక్కువగానే అయింది. రెండు నదుల నుంచి ఇప్పటివరకు 2,800 టీఎంసీలు సముద్రం పాలవగా, ఈ నెలాఖరుకు 3వేల టీఎంసీలకు చేరుకొనే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లోనే ఎక్కువ ప్రవాహం రావడం, ప్రాజెక్టులు నిండటంతో పాటు సముద్రంలోకి ఎక్కువగా వెళ్లిన సంవత్సరాలు అనేకం ఉన్నా.. ఎక్కువ రోజులు రిజర్వాయర్లలోకి ప్రవాహం కొనసాగిన సంవత్సరాల్లో మాత్రం ఇదొకటని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మేడిగడ్డ నుంచి 2522 టీఎంసీలు దిగువకు

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి అక్టోబరు 23 వరకు మేడిగడ్డ(medigadda project) నుంచి 2,522 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. శనివారం 96 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. అటు గోదావరి, ఇటు ప్రాణహితతో పాటు మానేరు నది నుంచీ ప్రవాహం ఎక్కువగా ఉంది. మేడిగడ్డ నుంచి వదిలిన 2,522 టీఎంసీల్లో 1,122 టీఎంసీలు గోదావరి నుంచి రాగా, మిగిలింది ప్రాణహిత నుంచి వచ్చింది. రెండువైపుల నుంచి భారీగా రావడంతోనే ఈ సంవత్సరం మేడిగడ్డ వద్ద అత్యధిక నీటి లభ్యత ఉంది. శ్రీరామసాగర్‌(ఎస్సారెస్పీ(Sri Ram Sagar project)) ప్రాజెక్టులోకి మహారాష్ట్రతో పాటు సింగూరు, నిజాంసాగర్‌ నుంచి 665 టీఎంసీలు వచ్చింది. ఎస్సారెస్పీ దిగువనా నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో ఎల్లంపల్లికి 1,043 టీఎంసీలు వచ్చింది. మధ్యమానేరుకు వదిలింది పోనూ మిగిలింది సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా మేడిగడ్డకు వదిలారు. మధ్య మానేరు నుంచి సుమారు 200 టీఎంసీలు అన్నారంలోకి వచ్చాయి. ఇలా అన్ని నదుల్లో భారీగా నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ దిగువన గోదావరిలో కలిసే శబరి, సీలేరులో తక్కువగా ఉంది. గోదావరి డెల్టాకు సుమారు 125 టీఎంసీల నీటి విడుదల కాగా.. 2,350 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది.

అన్నింట్లో పూర్తిస్థాయి నీటిమట్టాలు

ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టులో(Srisailam Project)కి ఇప్పటివరకు వెయ్యి టీఎంసీలు వచ్చాయి. ఆలమట్టిలోకి 675 టీఎంసీలు వచ్చాయి. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి దిగువకు సుమారు 400 టీఎంసీలు విడుదల చేసినట్లు అంచనా. ప్రస్తుతం శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌, పులిచింతల.. అన్నీ పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. దీంతో యాసంగి(రబీ) ఆయకట్టుకూ పుష్కలంగా నీరందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 450 టీఎంసీలు కృష్ణా నుంచి సముద్రంలోకి వెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details