నిత్య జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్(Plastic) పర్యావరణానికి పెను సవాలు విసురుతోంది. ‘ఒకసారి వాడి పారేసే’ (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి. తక్కువ మందం కలిగిన వీటిని తిరిగి ఉపయోగించే అవకాశం లేదు. మట్టిలో కలిసిపోవడానికి దశాబ్దాల సమయం పడుతోంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గతేడాది సగటున రోజుకు 1295 టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇందులో నాలుగింట మూడొంతులు జీహెచ్‌ఎంసీ నుంచే వచ్చింది. 2018-19తో పోలిస్తే రాష్ట్రంలో రెండేళ్లలో 158 వ్యర్థాలు శాతం పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది ఆందోళనకరమైన అంశమే. ఇందుకు కొవిడ్ కూడా కారణమని పీసీబీ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లలో ఒకసారి వాడి పారేసేవి ఎక్కువగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది.
ఒకసారి వాడి పారేసేవి..
కూరగాయలు, మాంసం తెచ్చేందుకు వినియోగించే ప్లాస్టిక్ సంచులు.. కొబ్బరిబోండాలు, పండ్లరసాలు తాగేందుకు వాడే స్ట్రాలు.. అల్పాహారం, భోజనం చేసే ప్లాస్టిక్ ప్లేట్లు, టీ తాగే గ్లాసులు.. స్పూన్లు, ఫోర్కులు.. ఇయర్ బడ్స్.. పాల ప్యాకెట్లు నీళ్ల సీసాలు.. ఇలా ఎన్నో..
ఏడాదికోసారి నివేదిక
జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 141 పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో ఉత్పత్తి అయ్యే ఘన, ప్లాస్టిక్ వ్యర్థాల గణాంకాల్ని ప్రతి మూడు నెలలకు ఓసారి సీపీసీబీకి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పంపిస్తోంది. ఏడాదికి ఓసారి సీపీసీబీ వార్షిక నివేదిక విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాల్ని కూడా లెక్కిస్తే మరింత ఎక్కువ ఉంటుంది.