తెలంగాణ

telangana

ETV Bharat / city

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఏపీ సీఎం జగన్​

ఏపీలోని ఏలూరు ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని.. 24 గంటలూ అందుబాటులో ఉంటూ ప్రత్యేక వైద్యసేవలు అందించాలని సూచించారు.

health-department-has-submitted-reported-on-the-eluru-incident-to-the-chief-minister-jagan
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఏపీ సీఎం జగన్​

By

Published : Dec 8, 2020, 5:08 AM IST

మెరుగైన వైద్యసేవలందిస్తాం.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంతుచిక్కని వ్యాధి బారిన పడిన బాధితులకు భరోసా ఇచ్చారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా వైద్యసేవలు అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు లోనైన బాధితులను పరామర్శించి, పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం హెలికాప్టర్‌లో ఏలూరు వచ్చారు. నేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, ఇన్‌ఛార్జి డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలా అస్వస్థతకు లోనయ్యారు, లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? చికిత్స బాగా అందుతుందా అని అడిగారు. బాధితుల పడకపై వారికి దగ్గరగా కూర్చుని ముఖ్యమంత్రి మాట్లాడారు. తొలుత భయపడినా ఇప్పుడు బాగానే ఉందని, అయితే ఆందోళన మాత్రం పోలేదని పలువురు కంటతడి పెట్టారు. ఏం పర్వాలేదు.. పూర్తిగా కోలుకునేలా చక్కటి వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వారికి ధైర్యం చెప్పారు. స్పెషలిస్టు వైద్యులను రప్పించామన్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి వారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఏం చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం ఆసుపత్రిలో వైద్యాధికారులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతమందికి వైద్యసేవలు అందించారు.. ఫలితాలు ఎలా ఉన్నాయని అడిగారు. మూడు రోజులుగా కేసులు వస్తూనే ఉన్నాయని.. ఎక్కడా రాజీ పడకుండా వైద్యసేవలు అందిస్తున్నామని ఇన్‌ఛార్జి డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. చికిత్స ప్రారంభించాక బాధితులు కోలుకుంటున్నారన్నారు. వైద్యసిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని.. 24 గంటలూ అందుబాటులో ఉంటూ ప్రత్యేక వైద్యసేవలు అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని సమకూర్చాలని కలెక్టర్‌ ముత్యాలరాజును ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన సీఎం 45 నిమిషాలపాటు అక్కడే గడిపారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, పేర్ని నాని తదితరులు ఉన్నారు.
అనంతరం మంత్రులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. ఉన్నట్లుండి ఇంత మంది ఒకేసారి అనారోగ్యం బారినపడటానికి కారణాలను అన్వేషిస్తున్నామని కలెక్టర్‌ ముత్యాలరాజు చెప్పారు. తాగునీటి పరీక్షలు చేయించగా నివేదికలు సాధారణంగానే ఉన్నాయన్నారు. వివిధ రకాల రోగాలకు కారణమవుతున్న వైరస్‌లపై అన్ని పరీక్షలు చేశామని, వాటి నివేదికలు కూడా సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. బాధితుల్లో నీటిని వేడి చేసుకుని తాగేవారు, శుద్ధజలం తాగేవారు కూడా ఉన్నారని... అన్ని వయసుల వారు అనారోగ్యం బారిన పడుతున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాణాపాయ స్థితి ఏర్పడకపోవడం అదృష్టమని సీఎం అన్నారు. అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ సత్వర వైద్య సేవలందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

కోలుకున్నాక మళ్లీ అవే లక్షణాలు!


చికిత్స అనంతరం ఇంటికెళ్లిన వారిలో మళ్లీ అదే వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చినవారు ఎవరైనా ఉన్నారా? అని అధికారులను సీఎం ప్రశ్నించారు. ముగ్గురు వ్యక్తులు రెండుసార్లు వచ్చారని కలెక్టర్‌ తెలిపారు. చికిత్స అనంతరం ఇంటికివెళ్లే వారిని కూడా గమనిస్తూ ఉండాలని సీఎం సూచించారు. వారికి ఔషధాలతో పాటు పోషకాహారాన్ని కూడా అందించాలని ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం జగన్‌.. దేవరపల్లిలో జరిగిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ విందు వేడుకకు హాజరు కావాల్సి ఉంది. అంతుచిక్కని వ్యాధి బాధితులను పరామర్శించేందుకు ఆయన ఏలూరు వెళ్లడంతో దేవరపల్లి పర్యటన రద్దయింది.

ఇదీ చదవండి:ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details