గురుకుల విద్యా సంస్థల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమమైంది. నూతన జోన్ల ప్రకారం సర్వీసు నిబంధనలు సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిగ్రీ లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులు మల్టీ జోనల్ పరిధిలోకి రానున్నాయి. జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు జోనల్ పోస్టులుగా ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్, అంతకన్నా కిందిస్థాయి ఉద్యోగాలు జిల్లా కేడర్‌గా సవరించారు.
గురుకులాల్లో బోధన సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేకంగా గురుకుల నియామకాల బోర్డును సర్కారు ఏర్పాటు చేసింది. టీజీటీ, పీజీటీ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల నియామక నోటిఫికేషన్లు జారీ చేసి.. ప్రక్రియ దాదాపు పూర్తి చేసింది. మరో నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి తెస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి.