రాష్ట్రంలో భూగర్భజల మట్టంలో మంచి పెరుగుదల నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జలాశయాలు, చెరువులు నింపుతున్నారు. వర్షాలు బాగానే పడుతున్నాయి. ఫలితంగా భూగర్భజలమట్టం పెరుగుతోంది. ఈ మేరకు భూగర్భజలవనరుల శాఖ రాష్ట్రంలో పరిస్థితిని విశ్లేషించింది. ఈ ఏడాది జులైలో భూగర్భజలాల సగటు లోతు 9.26మీటర్లు ఉంది. గతేడాది ఇదేనెలలో సగటు 14.12 మీటర్లకు పడిపోయింది. అంటే 4.86 మీటర్ల మేర భూగర్భజల మట్టంలో పెరుగుదల ఉందని తేలింది. గత దశాబ్ద కాలంగా చూసినా సగటున 2.4 మీటర్ల మేర భూగర్భజలాల్లో పెరుగుదల నమోదైంది. జులైలో 158 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగాయని, ఈ సీజన్‌లో పెరుగుదల 208 టీఎంసీల వరకు ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు.
కాళేశ్వర జల మహత్యం... గణనీయంగా పెరుగుతున్న భూగర్భజల మట్టం - kaleshwaram updates
కాళేశ్వరం పరీవాహక ప్రాంతంలో భూగర్భజల మట్టం పెరుగుతోంది. నిరుడు జూలైతో పోలిస్తే.... ప్రస్తుత జూలై వరకు దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని భూగర్భజలవనరుల శాఖ ప్రకటించింది. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, భువనగిరి జిల్లాల్లో నీటిమట్టం పెరుగుదల అధికంగా ఉందని నిర్ధరించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రభావం భూగర్భ జలమట్టం పెరుగుదలలో ఉందని అధికారులు తేల్చారు. 2019 జులైలో ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు10 మీటర్ల దిగువన.. 602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. 2020 జులై నాటికి ఆ విస్తీర్ణం 2వేల419 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో ఇది 16శాతం అంటే.. 18వందల 17 కిలోమీటర్ల మేర పెరుగుదల ఉందని అధికారులు నిర్ధరించారు. 20 మీటర్ల దిగువన భూగర్భ జలాలుండే ప్రాంతాలు 39.6శాతం తగ్గాయని లెక్కతేల్చారు. గతంతో పోలిస్తే నిజమాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో భూగర్భజలమట్టం గణనీయంగా పెరిగిందని భూగర్భజలవనరుల శాఖ తెలిపింది. గత దశాబ్దపు గణాంకాలు పరిశీలిస్తే కూడా పెరుగుదల గణనీయంగా ఉందని అధికారులు తెలిపారు.
2010-19 వరకు భూగర్భజలాలు 10 మీటర్ల దిగువన.. 981 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే ఉండగా.. ప్రస్తుతం ఆ విస్తీర్ణం 2వేల419 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే దాదాపు 10 శాతం విస్తీర్ణంలో జలాలు పెరిగాయని భూగర్భజలశాఖ అంచనా వేసింది.