తెలంగాణ

telangana

ETV Bharat / city

సమగ్ర భూ సర్వే.. వివాదాల్లేని రాష్ట్రమే సర్కార్ లక్ష్యం - తెలంగాణలో సమగ్ర భూ సర్వే

రాష్ట్రంలో భూములపై సమగ్ర సర్వేకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశాబ్దాలుగా నెలకొన్న వివాదాల పరిష్కారం ఆ దిశగా కసరత్తులు ప్రారంభిస్తోంది. నిజాం నాటి సర్వే దస్త్రాలే నేటికీ ఆధారమైనందున... రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాధ్యాసాధ్యాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ఇప్పటికే నివేదిక సమర్పించిన ఐఏఎస్‌ల కమిటీ... సర్వేకు రూ. 6వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది.

governament prepare plan to samagra land survey in telanagan
సమగ్ర భూ సర్వే.. వివాదాల్లేని రాష్ట్రమే సర్కార్ లక్ష్యం

By

Published : Sep 6, 2020, 7:07 AM IST

సమగ్ర భూ సర్వే.. వివాదాల్లేని రాష్ట్రమే సర్కార్ లక్ష్యం

భూ వివాదాలు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త రెవెన్యూ చట్టం, భూపరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వం... సమస్యకు పరిష్కారం చూపటంపై దృష్టి సారించింది. 1936వ సంవత్సరంలో అనగా... 84ఏళ్ల క్రితం నిజాం పరిపాలనలో చేసిన భూసర్వేనే ప్రామాణికంగా... నాటి వివరాల ఆధారంగానే దస్త్రాలు కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలో పూర్తిస్థాయి భూసర్వే నిర్వహించాలని రెండేళ్ల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్​ భావించారు. ప్రాథమికంగా కసరత్తులు కూడా మొదలుపెట్టి... నూతన సర్వే నివేదిక ద్వారా రైతుబంధు సాయం అందించాలకున్నారు. తక్కువ సమయంలో సర్వే సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడం వల్ల... అప్పట్లో సీఎం వెనక్కి తగ్గారు. ప్రస్తుతం రెవెన్యూ సంస్కరణల సందర్భంగా సర్వే సాధ్యాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సర్వేకు ఎంత సమయం పడుతుందనే దానిపై పలువురు ఐఏఎస్‌లు, రెవెన్యూశాఖకు చెందిన విశ్రాంత అధికారులు ఒక నివేదికను రూపొందించారు.

రూ.600 కోట్ల వ్యయం..!

రాష్ట్రంలో దాదాపు లక్ష కిలోమీటర్ల భూ విస్తీర్ణం ఉంది. నీటి వనరులు, అడవులు తీసివేస్తే వ్యవసాయం ఇతర భూముల సర్వే చేపట్టాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువగా సర్వేకు కనీసం ఆరు నెలల నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశాలున్నాయి. భూ సర్వే కోసం డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం-డీజీపీఎస్​, డిజిటల్ పట్టాలతో లైడార్ సర్వే, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే తదితర పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

భూ యజమాని సమక్షంలోనే డీజీపీఎస్​ సర్వే చేస్తే... ప్రజల మద్దతు కూడా లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పద్ధతిలోనే వీలైనంత త్వరగా పూర్తిచేసే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు. సాంకేతిక యంత్రాలు, మానవ వనరులు, తదితర ఖర్చులు కలుపుకుని రూ.6 వందల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఏ సమస్యలు లేని భూ లావాదేవీలకు రాష్ట్రం వేదిక కావాలని సీఎం ధృడనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో... కొత్తచట్టంతో పాటు సమగ్ర భూసర్వే కూడా పూర్తిచేస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది.

బై నంబర్లు ఎక్కువయ్యాయి

నిజాం కాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగానే రాష్ట్రంలో భూ దస్త్రాల లావాదేవీలు కొనసాగుతున్నాయి. కాలంతో పాటు భూ యజమానులు కూడా మారుతూ రాగా... భౌగోళిక సరిహద్దులు కూడా మారాయి. సాగు విస్తీర్ణం, నివాస ప్రాంతాలు అనూహ్యంగా పెరిగాయి. వాగులు, వంకలు, చెరువులు, కొండలు, గుట్టలు, ఇతర వనరులు భౌతిక రూపం పూర్తిగా మారిపోయింది. నాటి సర్వే దస్త్రాల్లో ఫలానా కొండ పక్కన అని మొదలు పెట్టి హద్దును సూచించేవారు. చాలా ప్రాంతాల్లో కొండలు కరిగిపోవటం, క్రయవిక్రయాలు, పంపకాలతో భూమి చాలా మంది చేతులు మారింది.

భూసర్వే నంబర్ల పక్కన బైనంబర్లు పెరిగిపోయాయి. దస్త్రాల్లో నమోదైన విస్తీర్ణం కూడా క్షేత్రస్థాయి కన్నా పెరిగింది. భూ వివాదాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఇదే విషయం 2017 సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య రాష్ట్రంలో చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళనలో కూడా వెలుగు చూసింది. గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టత లేకుండా, వివాదాల్లో ఉన్న భూములు రాష్ట్రంలో 17లక్షల 89వేల ఎకరాలున్నాయి. కొత్త పట్టా పాసుపుస్తకాల పంపిణీలోనూ జాప్యానికి పార్ట్-బీ భూములే కారణమవుతున్నాయని గుర్తించారు.

వీఆర్‌వోలు కీలకం..

సంస్కరణల్లో భాగంగా వీఆర్​వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయటానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని భూముల వివరాలు తెలిసిన వీరి సహకారం సర్వే ప్రక్రియకు అవసరమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రైవేటు సర్వే ఏజెన్సీల సహకారంతో సర్వే చేపట్టినా... క్షేత్ర స్థాయిలో సహకరించేందుకు యంత్రాంగం అవసరం ఉంటుందని కూడా అధికారులు పేర్కొంటున్నారు. గ్రామస్థాయిలో ఏ భూమి ఎక్కడుంది... సర్వే నంబర్లు ఏమిటన్నది అధికారులకన్నా వీఆర్​వోలకే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఈ క్రమంలో వారి సహకారంతోనే సర్వే పూర్తి చేస్తారా..? రెవెన్యూ సంస్కరణల అనంతరం సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? అనేది వేచిచూడాల్సి ఉంది.

2017-18 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కగూడ, చింతపల్లిగూడ, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌ను ఎంచుకుంది. సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థకు చెందిన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఉపయోగించి ఈ గ్రామాల్లో నిర్దేశిత కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సర్వే చేపట్టారు. ఇక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వేకు వెళ్లాలనుకున్నప్పటికీ వెనుకడుగు వేశారు.

ABOUT THE AUTHOR

...view details