సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచానికి మానవ వనరులను అందిస్తున్న భారత్.. డేటా సైన్స్ నైపుణ్యంలో మాత్రం బాగా వెనకబడిపోయింది. అభివృద్ధికి, ఉద్యోగాలకు భారీ అవకాశాలున్న ఈ రంగంపై దృష్టి పెడితే భారతీయ యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని ప్రపంచ నైపుణ్య నివేదిక-2022 సూచించింది. డిజిటల్ ఎకానమీలో అత్యధిక ఉద్యోగావకాశాలను కల్పించే మూడు నైపుణ్య విభాగాలు-బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్‌లలో పరిస్థితిని నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోల్చుకుంటే టెక్నాలజీలో ఈసారి భారత్ నాలుగు స్థానాలను మెరుగుపర్చుకోగా.. వ్యాపారం, డేటా సైన్స్‌లో దిగజారినట్టు తెలిపింది. నైపుణ్యంలో దేశం మొత్తం ఒకే స్థాయిలో లేదని, ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఆన్లైన్ కోర్సులను అందించే ప్రతిష్ఠాత్మక కోర్సెరా సంస్థ ఈ గ్లోబల్ స్కిల్ రిపోర్ట్-2022ను ఇటీవల విడుదల చేసింది. ఈ సంస్థలో గత ఏడాది కాలంలో 100కిపైగా దేశాల నుంచి 10 కోట్ల మంది వరకు వివిధ నైపుణ్యాలను నేర్చుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి.. వాటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా నైపుణ్యాల స్థాయులను వెల్లడించింది.
భారత్‌కు 68వ స్థానం..మొత్తం మీద నైపుణ్యంలో భారత్ 68వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే ఈసారి 4 స్థానాలు దిగజారింది. డేటా సైన్స్‌లో భారత్ ప్రావీణ్యం 2021లో 38 శాతం ఉండగా.. 2022లో అది 26 శాతానికి తగ్గింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పడిపోయింది. ఆసియాలో 19వ స్థానంలో నిలిచింది. అయితే టెక్నాలజీ ప్రావీణ్య స్థాయులు 38 నుంచి 46 శాతానికి పెరగడం విశేషం. ఇందులో ఆరు స్థానాలను మెరుగుపర్చుకున్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్‌లో నైపుణ్యం విషయంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌ది కావడం విశేషం.
ఏడాదిలో 47 శాతం పెరిగిన కొలువులు..నైపుణ్యాలను భారత్ నిరంతరం మెరుగుపరుచుకోవాలని నివేదిక సూచించింది. ముఖ్యంగా మార్కెట్ దృష్ట్యా బహుళ జాతి కంపెనీలు దక్షిణాసియా వైపు చూస్తున్నాయని, అందుకే డేటా సైన్స్‌లో నైపుణ్యాల స్థాయులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశంలో 2020-2021 మధ్య కాలంలో డేటా సైన్స్ కొలువులు 47.10 శాతం పెరిగాయని తెలిపింది. ఈ రంగంలో 26 శాతం ప్రావీణ్యం కారణంగా కంపెనీలు ప్రతిభావంతులైన మానవ వనరులు లేక ఇబ్బంది పడతాయని పేర్కొంది.