తెలంగాణ

telangana

ETV Bharat / city

చదువుల నాడి పట్టేశారు...ర్యాంకులు కొట్టేశారు!

ఐఏఎస్ అవ్వాలనుకున్నా, తర్వాత మనసు మార్చుకుని వైద్యసేవలందించాలనుకుంది.. ఆకాంక్ష సింగ్‌. రోగులకు ప్రాణం పోసి.. వాళ్లకళ్లలో వెలుగులు చూడటానికి మించిన సంతృప్తి మరొకటి లేదు కనుకనే వైద్యవృత్తిలోకి రావాలనుకుంది.. స్నికిత. అమ్మానాన్నల స్ఫూర్తితో వైద్యవృత్తిలో అడుగుపెట్టాలనుకుంది చైతన్య సింధు.. నీట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచి తమ కలలని సాకారం చేసుకోవాలనుకుంటున్నారు వీరంతా..

girls topped in nit results 2020
నీట్ ఫలితాల్లో బాలికల హవా

By

Published : Oct 18, 2020, 9:15 AM IST

నాకోసం ఉద్యోగాన్ని వదులుకుంది..

ఒత్తిడి లేని ఇంటి వాతావరణం, కెరీర్‌ నిర్ణయాల్లో స్వేచ్ఛ...తనకు నీట్‌లో ఆరో ర్యాంకు (715/720మార్కులు) రావడానికి కారణమయ్యాయి అంటుంది తెనాలికి చెందిన పదిహేడేళ్ల గుత్తి చైతన్య సింధు..

తాతగారితో కలిపి మా ఇంట్లో ముగ్గురు వైద్యులున్నారు. తాతయ్య గుత్తి సుబ్రహ్మణ్యం శస్త్రచికిత్స నిపుణులు. నాన్న కోటీశ్వరప్రసాద్‌ ఈఎన్‌టీ నిపుణులు, అమ్మ సుధారాణి గైనకాలజిస్టు. మేమిద్దరం ఆడపిల్లలం. నేను, చెల్లి గౌతమి. ఎనిమిదో తరగతికి వచ్చాక సైన్స్‌పట్ల నాలో ఆసక్తి పెరిగింది. మెడిసిన్‌ చదువుతానని ఇంట్లో చెప్పినప్పుడు ‘నీ ఇష్టం’అంటూ నా నిర్ణయానికే వదిలేశారు. పదోతరగతి వరకు తెనాలిలోనే చదివా. ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్యలో చేరి... బైపీసీ తీసుకున్నా. అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకునేదాన్ని. నేను ఇంటిమీద బెంగపెట్టుకోకుండా అమ్మానాన్న ప్రతి ఆదివారం నా దగ్గరకి వచ్చేవారు. సైన్స్‌లో సందేహాలొస్తే అమ్మను అడిగేదాన్ని. ఇంటర్మీడియెట్‌ పరీక్షలయ్యాక ఇంటికొచ్చేశా. లాక్‌డౌన్‌ కావడంతోే ఇంటికే పరిమితమైనా నీట్‌కు అవసరమైన శిక్షణని ఇంటర్‌ చదువుతూనే తీసుకోవడంతో ధైర్యంగానే ఉన్నా.

మిగతా సబ్జెక్టులతో పోల్చితే బయాలజీ కోసం కాస్త ఎక్కువ కష్టపడ్డాననే చెప్పాలి. ఎంత కష్టమైనా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని తప్ప బట్టీ కొట్టలేదు. ఇంట్లో నీట్‌ పాత పేపర్లని సాధన చేసేదాన్ని. మధ్యలో ఏపీ ఎంసెట్‌(వ్యవసాయం, ఫార్మసీ) రాశా... మొదటిర్యాంకు వచ్చింది. సెప్టెంబరు 13న నీట్‌ పరీక్షని ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా రాశా. పదిలోపు ర్యాంకు వస్తుందని ఆరోజే అమ్మతో చెప్పా. దిల్లీ ఎయిమ్స్‌లో చదువుతా. వైద్య విభాగంలో శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నేను ఆరో తరగతికి వచ్చేంతవరకూ అమ్మ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేసేది. పని ఒత్తిడితో మాతో గడపటానికి సమయం సరిపోవడంలేదని ఆ ఉద్యోగం వదులుకుని ఇంటి దగ్గరే సొంత క్లినిక్‌ ప్రారంభించింది. హాస్టల్‌లో చదువుకునేటప్పుడు ఏమాత్రం ఒత్తిడిగా అనిపించినా అమ్మతో మాట్లాడేదాన్ని. ఇంటర్‌లో ఓసారి.. అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మరేం ఫర్వాలేదు... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు అని ధైర్యం చెప్పింది అమ్మ. ఆ ధైర్యమే లేకపోతే ఈ రోజు ఈ ర్యాంకు వచ్చేది కాదుకదా!

రోజుకి 70 కిలోమీటర్లు ప్రయాణించి..

నీట్‌లో నూటికి నూరుశాతం (720/720) మార్కులు సాధించింది ఆకాంక్ష సింగ్‌. శిక్షణ కోసం రోజుకి డెబ్భైకిలోమీటర్లు ప్రయాణించేదీ అమ్మాయి..

ఒడిశాకి చెందిన షోయబ్‌అఫ్తాబ్‌కి కూడా నాలానే 100శాతం మార్కులొచ్చాయి. వయసును ప్రామాణికంగా తీసుకొని ర్యాంకు ఇచ్చారు. దాంతో చిన్నదాన్నైన నాకు రెండో ర్యాంకు వచ్చింది. మా సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో ఉన్న అభినాయక్‌పుర్‌ అనే కుగ్రామం. నాన్న రాజేంద్ర కుమార్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. అమ్మ రుచి సింగ్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. పదోతరగతి వరకూ మా ఊళ్లోనే చదువుకున్నా.

తరువాత హాస్టల్‌లో ఉంటూ దిల్లీలోని ప్రగతి పబ్లిక్‌ స్కూల్లో ఇంటర్‌ పూర్తిచేశాను. నాకోసం నాన్న కూడా హాస్టల్‌కు దగ్గరగా ఒక రూమ్‌ తీసుకుని ఉండేవారు. నీట్‌ కోచింగ్‌ కోసం రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణించేదాన్ని. ఎప్పుడైనా ఒత్తిడి అనిపిస్తే అర్జీత్‌సింగ్‌ పాటలు వినేదాన్ని. మోటివేషనల్‌ స్పీకర్‌ సందీప్‌ మహేశ్వరి మాటలు నాకు స్ఫూర్తినిచ్చేవి. మొదట్లో ఐఏఎస్‌ అవ్వాలని కలలు కనేదాన్ని. తరువాత ప్రాణాలు పోసే డాక్టర్‌ కావాలని నా నిర్ణయాన్ని మార్చుకున్నా. భవిష్యత్తులో న్యూరోసర్జన్‌ అవ్వాలనుకుంటున్నా.

కాలేజీ పక్కనే ఇల్లు తీసుకున్నారు..

క్షణం తీరికలేకపోయినా.. రోగుల కళ్లల్లో ఆ వెలుగుని చూడ్డం కోసం నిరంతరం శ్రమించే అమ్మానాన్నలే తనకి స్ఫూర్తి అంటోంది నీట్‌లో మూడో ర్యాంకు (715/720 మార్కులు) సాధించిన తుమ్మల స్నికిత.

మాది వరంగల్‌. నాన్న సదానంద్‌రెడ్డి కార్డియాలజిస్ట్‌, అమ్మ లక్ష్మి గైనకాలజిస్ట్‌. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. పదోతరగతి వరకూ నాచారంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్లో చదివా. ఇంటర్‌కి శ్రీచైతన్యలో చేరా. చిన్నప్పట్నుంచీ నాకు డాక్టరవ్వాలని ఉండేది. అమ్మానాన్న నిత్యం బిజీగా ఉండేవారు. అయినా వాళ్ల వృత్తి నాకు నచ్చింది. కారణం...వాళ్లది ప్రాణం పోసే వృత్తి. చాలామంది రోగులు అమ్మానాన్నల్ని దేవుడిలా చూడ్డంతో నేనూ వాళ్ల దారిలో వెళ్లాలనుకున్నా. కాలేజీలో చేరినప్పుడు నాకోసం అమ్మానాన్న స్కూల్‌ పక్కనే ఇల్లు తీసుకున్నారు. వాళ్లకి ఎన్ని పనులున్నా సరే సాయంత్రం కాలేజీ నుంచి తిరిగొచ్చే సమయానికి వాళ్లూ ఇంట్లోనే ఉండేవారు. అమ్మ మొదట కేర్‌ ఆసుపత్రిలో పనిచేసేది. నాతో సమయాన్ని వెచ్చించడం కోసం ఇంటికి దగ్గరలో సొంతంగా క్లినిక్‌ మొదలుపెట్టింది. నాన్న కూడా నిజామాబాద్‌లో ఆసుపత్రిలో పనిచేసేవారు. ఇంటర్‌లో చేరినపుడు నాకోసం హైదరాబాద్‌ వచ్చేశారు.

ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉండాల్సివచ్చింది. ఆ సమయంలో నీట్‌ పాత పేపర్లని సాధనచేసేదాన్ని. దాదాపు 16 గంటలపాటూ చదివేదాన్ని. ఎన్నిసార్లు చదివినా గుర్తుండని కొన్నింటిని ప్రత్యేకంగా నోట్స్‌ తయారుచేసుకొని రివిజన్‌ చేసేదాన్ని. ఒత్తిడిగా అనిపించినప్పుడు పాటలు వినేదాన్ని. పరీక్ష కేంద్రానికి వెళ్లి కూర్చునేంతవరకూ ఒత్తిడిగానే అనిపించినా.. పరీక్ష రాశాక టాప్‌-10లో ఉంటాననే నమ్మకం వచ్చింది. ఫలితాల్లో మూడో ర్యాంకు వచ్చాక నా సంతోషం రెట్టింపైంది. కొవిడ్‌-19 వల్ల అమ్మానాన్న చాలా బిజీగా ఉండేవారు. అదే సమయంలో నాకు పరీక్ష తేదీ మారుతూనే ఉండేది. ఆ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు అమ్మమ్మతో మాట్లాడేదాన్ని. దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేయాలని ఉంది. ఈ వృత్తిలో రాణించి కుటుంబానికి గౌరవం తెస్తా.

ABOUT THE AUTHOR

...view details