గ్రేటర్ హైదరాబాద్ అంతా ఇరుకు గల్లీలే. ఎక్కడా కొంచెం ఖాళీ స్థలం కూడా కనిపించదు. నగరవాసులు ఎలాంటి చిన్న వేడుక చేసుకోవాలన్నా.. ఫంక్షన్ హాళ్ల వైపు చూడాల్సిందే. వాటికి రూ.వేలు, లక్షల్లో ఖర్చు పెట్టాలి. అయితే దిగువ మధ్యతరగతి, పేద వారికి అంత ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వారికోసం గ్రేటర్ హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ జంట నగరాల్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. నామమాత్రపు ఖర్చుతో సకల సౌకర్యాలతో కూడిన వివాహ వేదికలు ఒక్కొక్కటిగా పేదలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫంక్షన్ హాళ్లలో అద్దంలా మెరిసే ఫ్లోరింగ్, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, విశాలమైన వేదిక ప్రాంగణం, వాహనాలకు పార్కింగ్ వసతి, వంట గదులు, వధూవరులు, బంధుమిత్రులకు విశ్రాంతి గదులు, ఇతరత్రా సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నారు.
రూ.90 కోట్లతో 31 ఫంక్షన్ హాళ్లు..
గ్రేటర్ పరిధిలో రూ.90 కోట్లతో 31 ఫంక్షన్ హాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భూవివాదాలతో ప్రారంభంలోనే 12 ప్రతిపాదనలు నిలిచిపోయాయి. రూ.43 కోట్లతో 19 ఫంక్షన్ హాళ్ల పనులు మొదలయ్యాయి. ఇందులో సైతం పలు కారణాలతో నాలుగు ఫంక్షన్ హాళ్లు రద్దయ్యాయి. ఇక మిగిలింది 15 లో ఇప్పటికే రెండు వినియోగంలోకి రాగా... మరో 9 హాళ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పనులు యుద్దప్రాతిపాదికన సాగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. నిధుల సమస్య లేదని... పనుల్లో మరింత వేగం పెంచి ఈ ఏడాది చివరకు వీలైనన్ని ఎక్కువ ఫంక్షన్‌హాళ్లను గ్రేటర్ వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు పద్మారావు గౌడ్ తెలిపారు.