గణేశ్ చతుర్థి(Ganesh Chaturthi) వచ్చేస్తోంది. హైదరాబాద్‌లో సందడి మొదలైంది. చందాల వసూళ్లు, విగ్రహాల కొనుగోళ్లు, మండపాల ఏర్పాట్లతో భాగ్యనగరం కోలాహలంగా మారింది. గతేడాది కరోనా వ్యాప్తి వల్ల ఉత్సవాలు జరపలేదు. ఈసారి అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. బోనాల అనంతరం హైదరాబాద్‌లో గణేశ్ పండుగ ఘనంగా జరుగుతుంది. గల్లీకో వినాయకుడిని ప్రతిష్టించి పోటీపడుతూ వేడుకలు నిర్వహిస్తారు. గణపతి విగ్రహాల కొనుగోళ్లు.. నెల రోజుల ముందునుంచే ప్రారంభమవుతాయి.
కరోనా తగ్గినా.. పెరగని కొనుగోళ్లు..
గతేడాది గణేశ్(Ganesh Chaturthi) మండపాలకు ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో అనుమతి ఇవ్వడం వల్ల హైదరాబాద్‌లో మండపాల సంఖ్య తగ్గిపోయింది. వేడుకలు జరిగిన చోట కూడా నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా విగ్రహాల కొనుగోళ్లూ ఎక్కువగా జరగలేదు. దీనివల్ల వ్యాపారులు నష్టపోయారు. ఈఏడు కొవిడ్ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల విగ్రహాల కొనుగోళ్లు గతేడు కంటే కాస్త ఎక్కువగానే ఉన్నా.. కరోనా కంటే ముందుతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
విగ్రహాల తయారీ తగ్గిపోయింది..
హైదరాబాద్‌లో విగ్రహాల తయారీ, వ్యాపారానికి ధూల్‌పేట పేరుగాంచింది. ఇక్కడికి రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ఈసారి రాష్ట్రం నుంచి మాత్రమే ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఈ సారి ఇక్కడ కేవలం 8 నుంచి 10వేల విగ్రహాలు మాత్రమే తయారైనట్లు స్థానిక వ్యాపారులు అంచనా వేస్తున్నారు. సాధారణ సమయంతో పోల్చితే సగం వరకు విగ్రహాల తయారీ తగ్గిపోయిందని చెబుతున్నారు.
"కరోనా వ్యాప్తి, లాక్డౌన్, ఆర్డర్లు లేక ఎక్కువ గణేశ్ విగ్రహాలు తయారు చేయలేదు. గతేడాది తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా విక్రయం జరగకపోవడం వల్ల చాలా నష్టపోయాం. ఈఏడు అది పునరావృతం కాకుండా ఉండాలని తక్కువ విగ్రహాలే తయారు చేశాం. ప్రస్తుతం కొంత వరకు విగ్రహాల కొనుగోళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. కరోనా భయంతో విగ్రహాల తయారీ సగానికి తగ్గించాం. ప్రతి ఏడు తెలంగాణ నుంచే కాకుండా.. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు వచ్చేవారు. ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే వస్తున్నారు."