ఇదెక్కడి విడ్డూరంరా నాయనా.. గణపతి విగ్రహాన్ని కొనుక్కెళ్లాలి కానీ.. కొట్టేస్తారా..! Ganesh Idol Theft: వినాయకచవితికి లంబోదరుని ప్రతిమలు పెట్టి నవరాత్రులు సంబురాలు చేయటం ఆనవాయితీ. గణపతి సంబురాలంటే యువతతో పాటు చిన్నారుల్లో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. వీధివీధినా మండపాలు వేసి.. పెద్దపెద్ద గణనాథుని విగ్రహాలు పెట్టి కోలాహలంగా వేడుక చేస్తారు. ఈ పండుగలో సంబురాలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో.. ప్రతిమలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. విగ్రహాన్ని స్వయంగా తయారు చేయటమో, లేదా తయారు చేసిన ప్రతిమనే కొనుక్కొచ్చుకొని ప్రతిష్ఠించి పూజలు చేయటమో చేస్తుంటారు. లేదా.. పర్యావరణహితులెవరైనా మట్టి ప్రతిమలను పంపిణీ చేస్తే తెచ్చుకుని పూజిస్తారు.
అయితే.. పండుగకు పెట్టే ప్రతిమలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ.. గత రెండేళ్లు కరోనా కారణంగా మార్కెట్ కొంత నిరాశపర్చగా.. ఈసారి ఎలాంటి విఘ్నాలు లేకపోవటంతో విఘ్నేశ్వరునికి అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. దీంతో విగ్రహాల ధరలు గట్టిగా పలుకుతున్నాయి. అయినా సరే.. ఎవరి తాహతకు తగ్గట్టుగా వాళ్లు గణేషుని ప్రతిమలను కొనుక్కుని తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు యువకులు చేసిన పని మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వినాయకుడి విగ్రహాలకి ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. అయితే.. దానికి తగ్గట్టుగా చందాలు వసూలు చేయటమో..? దాతలను ఒప్పించటమో..? చేసి ప్రతిమను కొనుక్కెళ్లాలి. ఇవేవీ కాకపోతే.. వాళ్ల దగ్గరున్న బడ్జెట్‌కు సరిపోయే విగ్రహాన్ని కొనుక్కెళ్లాలి. అంతే కానీ.. ఓ ముగ్గురు యువకులు మాత్రం అందుకు భిన్నంగా.. రాజా సినిమాలో వెంకటేశ్‌ను ఫాలో అయ్యారు. అర్ధరాత్రి పూట ఏకంగా లంబోదరున్నే కొట్టేశారు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర భవన్ హోటల్ వద్ద జరిగింది.
సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు యువకులు వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్దకు వచ్చారు. తాము తెచ్చిన ఆటోను రోడ్డుకు అవతలివైపునే పెట్టారు. ఎవరూలేకపోవటం చూసి.. షెడ్డులో నుంచి వినాయకుడి విగ్రహాన్ని గుట్టుగా బయటకు తీసుకొచ్చారు. ప్రతిమ బరువుగా ఉండటంతో.. హోటల్ వద్ద రోడ్డుపై పెట్టారు. వాహనాలు రాని సమయంలో వినాయకున్ని వేగంగా రోడ్డు దాటించారు. రోడ్డు అవతల ఉన్న ఆటో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ తతంగమంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ యువకులు ఎవరూ..? ఎందుకు ఇలా చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి: