Mirchi Powder on passengers: హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో ఓ ప్రయాణికుడి దుశ్చర్యతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. పాస్‌పోర్టు సరిగా లేదంటూ విమానాశ్రయ అధికారులు అతడిని వెనక్కి పంపారు. తిరుగు ప్రయాణంలో అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు.
పాలకొల్లు పట్టణం సమీపంలోకి రాగానే.. ఒక్కసారిగా ప్రయాణికులపై కారం చల్లాడు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కారం ఘాటుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పాస్‌పోర్టు సరిగా లేదని వెనక్కి పంపారని తీవ్ర నిరాశకు గురైన రాంబాబు.. ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..:ఉండాల రాంబాబు స్వతహాగా వంట పనులు చేస్తుంటాడు. తెలుగు వారు పని చేసే కంపెనీల్లో కార్మికులకు వంటలు చేస్తుండేవాడు. వంట మనిషి అవసరం ఉన్నప్పుడు దుబాయ్‌కి వెళ్లి.. అవసరం తీరాక తిరిగి సొంతూరికి వచ్చేవాడు. ఇలా దుబాయ్‌కి వెళ్లే సమయంలో తన సామాన్లతో పాటు, కారం పొడిని కూడా తీసుకుని వెళ్లేవాడు. ఈ కారం సంగతి తనిఖీ అధికారులకు దొరక్కుండా తగు జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎప్పటిలానే దుబాయ్ వెళ్లేందుకు రాంబాబు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే, పాస్‌పోర్టు రెన్యువల్ డేట్ అయిపోవడం వల్ల.. ఎయిర్ పోర్టు అధికారులు రాంబాబును వెనక్కి పంపారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రాంబాబు.. బస్సులో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులపై కారం పొడి చల్లాడు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు చేరుకుని.. రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.