Free Training for job seekers: ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల్లో లక్షా 25 వేల మందికి బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అన్ అకాడమీ సంస్థతో కలిసి ఉచితంగా ఆఫ్లైన్, ఆన్లైన్, హైబ్రిడ్ విధానంలో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష కోసం ఈ నెల 16 వరకు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. నిరుపేదలకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఉచితంగా శిక్షణతో పాటు పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సై పోస్టు అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఎవరైనా ముందుకు వస్తే అక్కడ శిక్షణకు సహకరిస్తామని గంగుల కమలాకర్ తెలిపారు.
వార్షికాదాయం ఐదు లక్షల్లోపు ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 16న ఉదయం 11 గంటలకు అన్ని పోటీ పరీక్షల కోసం ఒకే ప్రవేశ పరీక్ష ఉంటుందని... నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. హైబ్రిడ్ నమునాలో శిక్షణ పొందే వారు ప్రాక్టీసింగ్కు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే ప్రతి ఒక్కరికీ ప్రవేశ పరీక్ష తప్పనిసరి అని బుర్రా వెంకటేశం తెలిపారు.