లెక్క తేల్చాలంటున్న అటవీ శాఖ! అటవీ భూముల విషయంలో లెక్కలు పక్కాగా లేకపోవడం వల్ల వివాదాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. అడవుల సంరక్షణ పేరుతో కొన్నిచోట్ల అటవీ ప్రాంతం చుట్టూ అధికారులు కందకాలు తవ్విస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అడవి మధ్య పట్టా భూములుండటం... రైతులు ఆ పత్రాలు చూపి నిలదీస్తుండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వివాదాలతో విసిగిపోయిన అటవీశాఖ లెక్కలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
నేతల జోక్యంతో ఘర్షణలు
హరితహారంలో భాగంగా అటవీశాఖ క్షీణించిన అడవుల్లో మొక్కలను పెంచుతోంది. కొన్నిచోట్ల తాము చాలాకాలంగా పోడు చేసుకుంటున్న భూములు అని రైతులు అభ్యంతరాలు చెప్పటం, రాజకీయ నాయకుల జోక్యాలతో ఘర్షణలకు దారితీస్తోంది. 2005 తర్వాత ఆక్రమణలు జరిగిన అటవీ భూములనే స్వాధీనం చేసుకుంటున్నామని.. దశాబ్దకాలం క్రితం ఆక్రమించి పోడుచేస్తున్న వారి జోలికి వెళ్లటం లేదని అధికారులు చెబుతున్నారు.
లెక్కలు పక్కాగా తేలాలి
అటవీ భూములుగా ప్రకటించినవాటిలో సర్వే నంబర్లు లేని భూములు దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. అటు దస్త్రాల పరిశీలన, ఇటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే అటవీ భూములు పెద్దసంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని తెలుస్తోంది. వీటన్నింటికి లెక్కలు పక్కాగా తేలితే.. ఆక్రమణలు, వివాదాల విషయంలో ఎలా ముందుకెళ్లాలో ఓ స్పష్టత వస్తుంది.