అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేసింది అటవీశాఖ. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా... పులులు ఉండటం వల్ల అడవులకు కలిగే ఉపయోగాలు, అటవీ సంపదను కాపాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలను అటవీ శాఖ అధికారులు నిర్వహించారు. పులుల రక్షిత ప్రాంతాలైన అమ్రాబాద్, కవ్వాల్తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాచలం, మెదక్, నాగర్కర్నూల్ తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి.
పెరుగుతున్న పులుల సంఖ్య
అటవీ శాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభతో పాటు, ఉన్నతాధికారులు... అరణ్య భవన్ నుంచి జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించారు. గత లెక్కల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నాయని... ప్రస్తుతం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఈ సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. పులుల ఆవాసాల అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. పర్యావరణం, ప్రకృతి రక్షణలో పులులు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయన్న అధికారులు... వాటి ఆవాసాలను దెబ్బతీయడం, వాటితో ప్రమాదకరంగా ప్రవర్తిస్తే తప్ప, పులుల వల్ల ఎలాంటి హాని జరగదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.