రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు 40 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 82 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సోమవారానికి 107 స్లాట్లు బుక్ చేసుకున్నా... సంబంధింత వ్యక్తులు రాకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఏడురకాల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వగా అమ్మకం ( సేల్ డీడ్, రిజిస్ట్రేషనే ఎక్కువగా జరిగాయి. సోమవారం అమావాస్య కావడంతో తక్కువ మందే ప్లాట్లు బుక్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా 40 కార్యాలయాల పరిధిలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి.
రంగారెడ్డి జిల్లా కాకుండా ఇతర జిల్లాలను పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొన్ని చోట్ల సర్వర్ సమస్యలలో కొంత జాప్యల జరిగినా చివరకు పూర్తయ్యాయి. రికార్డులో పేరు మార్పు (మ్యుటేషన్ కూడా వెంటవెంటనే పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే డాక్యుమెంట్, ఈ పాస్ పుస్తకాన్ని కొనుగోలుదారులకు అందజేశారు. హైదరాబాద్ అజంపురాలో ఉదయం 10: 45 గంటల స్లాట్ ఇవ్వగా సర్వర్ సమస్య ఏర్పడడంతో ఒంటిగంటకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు స్లాట్లు నమోదు కాగా ఒక సేల్‌డీడ్, ఒక మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. సంబంధిత వ్యక్తి రాని కారణంగా ఒకటి, వేలి ముద్రలను కంప్యూటర్ స్వీకరించక పోవడంతో మరో రిజిస్ట్రేషన్ జరగలేదు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన వెబ్ సైట్ కు అనుసంధానం కాకపోవడంతో షాట్లు బుక్ కావడంలేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొనుగోలుదారు డబ్బును ఏ రూపంలో చెల్లించారనే వివరాల నమోదుకు అవకాశం ఉండాలని రిజస్ట్రేషన్ చేసుకున్న వారు కొందరు సూచించారు. లింక్ డాక్యుమెంట్లను పరిశీలించేలా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు.
ఖాళీ స్థలాలకు ఎప్పుడు?
తొలిరోజునే భారీ స్థలాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించలేదు. నిజానికి రిజిస్ట్రేషన్లలో అత్యధికం ఇలాంటివే ఉంటాయి. వీటికి అవకాశం ఇస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్లాట్లకు కూడా వెంటనే అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. స్లాట్ బుకింగ్ పడే సమస్యలు వస్తున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేచోట ఒకటి రెండు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యదిక సేవలకు స్లాట్ బుక్ కావడంలేదని అభిప్రాయపడ్డారు.