పోలీసు కేసులు ఉన్నవారికి పాస్‌పోర్టులు(PASSPORTS) ఇస్తే.. హాయిగా విదేశాలకు చెక్కేసి విచారణ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాస్‌పోర్టు జారీకి పోలీసు విచారణ తప్పనిసరి. కాని చాలా సందర్భాల్లో ఇది సరిగా జరగదు. మాఫియా డాన్ అబూ సలేం(MAFIA DON ABU SALEM) ఉదంతమే ఇందుకు నిదర్శనం. కర్నూలు చిరునామాతో దరఖాస్తు చేసుకొని, కిందిస్థాయి సిబ్బందిని మచ్చిక చేసుకొని పాస్‌పోర్టు పొందిన అబూ సలేం అతని ప్రియురాలు మోనికా బేడి గ్రీస్ చెక్కేశారు. ఇకమీదట అలా కుదరదు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల వేలిముద్రల ద్వారా వారి నేర చరిత్రను పరిశీలించబోతున్నారు. రెండేళ్లుగా నమూనా పద్ధతిలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తుండగా ఇక మీదట ప్రతి దరఖాస్తుదారుడి వేలిముద్రలనూ(FINGERPRINTS) విశ్లేషించనున్నారు. తద్వారా నేర చరిత్ర ఉన్న వారికి పాస్‌పోర్టులు(PASSPORTS) జారీ కాకుండా సమర్థంగా నిరోధించాలని భావిస్తున్నారు. గత రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో ఇలా వేలిముద్రల ద్వారా 116 మందిని గుర్తించి పాస్‌పోర్టులు రాకుండా అడ్డుకోగలిగారు.
రెండు, మూడు రోజుల్లోనే విచారణ పూర్తి
నేర చరిత్ర ఉన్నవారికి పాస్‌పోర్టులు ఇవ్వరు. అందుకే దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసు విచారణ జరిపేది అందుకే. దరఖాస్తుదారుడి చిరునామా ప్రకారం స్పెషల్ బ్రాంచి(SPECIAL BRANCH) పోలీసులు వ్యక్తిగతంగా కలిసి, చుట్టుపక్కల వారిని విచారిస్తారు. దాంతోపాటు తమవద్ద అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలిస్తారు. ఈ మేరకు పాస్‌పోర్టు కార్యాలయానికి(PASSPORT OFFICE) నివేదిక పంపుతారు. గతంలో ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 20 రోజులు పట్టేది. కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రెండు మూడు రోజుల్లోనే దీన్ని పూర్తి చేస్తున్నారు. ఒకవేళ దరఖాస్తుదారునికి ఏదైనా నేర చరిత్ర ఉన్నా, పోలీసు కేసులు ఉన్నా పాస్‌పోర్టు జారీ నిరాకరిస్తారు. దీనిపై విభేదిస్తే సదరు దరఖాస్తుదారుడు న్యాయస్థానం ద్వారా ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పాస్‌పోర్టు జారీ అంశంలో పోలీసు విచారణే కీలకమైంది. అందుకే విచారణకు వచ్చే సిబ్బందిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించి తద్వారా సానుకూల నివేదిక వచ్చేలా చూసుకుంటారు.
6 లక్షల మంది వేలిముద్రలు నిల్వ